మానవత్వం నుంచి దైవత్వానికి – పరనిర్వాణం
సావిత్రి సత్యవంతుల కథ మానవత్వం నుంచి దైవత్వానికి జరిగిన పరిణామానికి నిదర్శనం. సావిత్రి సంకల్పం బలమైనది, బలీయమైనది. ఆ కారణంగానే మృత్యువు (యముడు) బెదిరింపులకు లొంగలేదు, దయాదాక్షిణ్యాలను ఆశించలేదు అంతకన్నా తన లక్ష్యాన్ని వదలలేదు. సత్యవంతుడితో జీవించడం తన హక్కుగా భావించింది. అందుకే మృత్యువును జయించాలని నిర్ణయించుకుంది. అంతవరకు మృత్యువుతో సావిత్రి జరిపిన ఎడతెగని వాగ్వాదాలతో సత్యవంతుడిని పొందనూలేదు, మృత్యువును జయించనూలేదు. భూలోకానికి తిరిగి వెళ్లడం అంటే అది సత్యవంతుడితోనే, ఇది ఆమె నిర్ణయం. కానీ అది జరగాలంటే, అజ్ఞానాన్ని, అంధకారాన్ని, మృత్యువుని ధిక్కరించాలి, జయించాలి. మృత్యువుని జయించడం అంటే చీకటి నుంచి వెలుగును రక్షించుకోవడం.
బురదలో చరించే పురుగు బురదను అసహ్యించుకోదు ఎందుకంటే అది ప్రకృతి సహజం. కొందరు ప్రాపంచిక సుఖాలను, జీవితాలను తక్కువని, క్షుద్రమని గర్హిస్తారు దివ్యత్వాన్ని అమరత్వాన్ని కాంక్షిస్తారు కానీ ఇందుకు భిన్నంగా సావిత్రి మానవ జీవితాన్ని, సత్యవంతుడితో సాధారణ జీవితాన్ని కోరుకుంటుంది.
ఈ లోకంలో ఉన్నవన్నీ విచిత్రమైన వైరుధ్యాలే, మంచి చెడులు, చీకటి వెలుగులు, సుఖదుఃఖాలు, ఆనంద విషాదాలు ఇలా అనేకం. ఇవన్నీ సృష్టి సహజాలు, పరమాత్మ లీలలుగా చెబుతారు శ్రీ శార్వరి.
అవరోధాలు, వైరుధ్యాలు పరమాత్మ కళలే
అనేకానేక రూపాలు ఆ ఏకత్వంలోని భాగాలే
ఏకత్వమే అనేకత్వాన్ని తనలో దాచుకుంటుంది
పరమాత్మే అవ్యక్తం, అద్వితీయం, అత్యంత నిగూఢం
ఆయనే సమస్త విశ్వాన్ని వీక్షిస్తున్న ఏకైక మూర్తి.
ఈ సృష్టిలో జీవునితో బాటుగా ఆనందం విషాదాలు, సంయోగ వియోగాలు ఆవిర్భవించాయి. అన్నీ సహజాలు, ప్రకృతి ధర్మాలే. పాపంలో, పుణ్యంలో, మంచిలోను, చెడులోను ఆనందం వుంది. బాధలోనే ఆనందం, కష్టాలలోనే సుఖాలు ఉన్నాయి. వాస్తవానికి చీకటి మనకు ఆరంభమూ కాదు, అంతమూ కాదు. జీవుని లోలోపలి తేజస్సును మరుగు పరుస్తుంది చీకటి లాంటి అజ్ఞానం. నిగూఢ బ్రహ్మానందాన్ని మాయచేసేది చీకటి లాంటి యాతన.
హైందవ సంప్రదాయంలో కర్మ సిద్ధాంతాన్ని విస్తృతంగా నమ్ముతారు. గత జన్మల కర్మఫలం ఈ జన్మగా, ఈ జన్మలో చేసే కర్మలు రాబోయే జన్మలను నిర్దేశిస్తాయని చాలా మంది నమ్ముతారు. అందుకే శ్రీ శార్వరి మనిషి చేసే కర్మల గురించి ఇలా అంటారు:
“జీవనపధంలో మనవెంట మృత్యువు నడుస్తూ
ఆరంభంలో అజ్ఞాతంగా, సాక్షీమాత్రంగా ఉండి
మనిషి చేసిన కర్మలపై తుది తీర్పు నిస్తుంది”.
“మట్టినుండి పుట్టిన మనిషి మట్టిలో కలిసిపోవలసిందే. ఆది ధర్మం, న్యాయం” ఇది యముడి వాదన.
నిషిద్ధమైన విషయాలలోనే ఆనందం ఎక్కువగా వుంటుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే కృతనిశ్చయంతో వుంటారు కొందరు. కర్మసిద్ధాంతం ఎంత భయపెట్టినా భయపడరు పైగా ప్రకృతి సహజం అంటే అస్సలు ఒప్పుకోరు. ఆ కోవలోకి చెందిందే సావిత్రి.
ఇవి కూడా చదవండి
“నా ప్రేమ ప్రాపంచికం కాదు. అది ఈశ్వర ప్రసాదం. అది దివ్యం. అది శరీరానికి, హృదయానికి పరిమితం కాదు. నా ప్రేమలోనే దివ్యత్వం ఉంది. అది భూమికి సంబంధించినది కానేకాదు. సృష్టి ఆదినుండి నేను, సత్యవంతుడు ప్రేమికులం.” ఇది సావిత్రి నమ్మిక.
మేమిరువురం అనాదిగా దంపతులమే.
ఆరని ఒకే అగ్ని నుండి ప్రభవించిన రెండు సమిధలం.
నా గుండెలో స్పందన కలిగించేది ఒకే హృదయం
నా హృదయపీఠంపైన ఉన్నది ఒకే ఒక్క దేవుడు
నేను కోరే రూపంలో అతనిని నన్ను పరిగ్రహించనీయండి!
నేను ప్రేమించే అతని ఆత్మలో ఏకం కానీయండి.
ఇది సావిత్రి స్థిరచిత్తం.
అసలు స్వర్గం, దివ్యత్వం రెండూ యదార్ధమా లేదా కల్పితాలా అన్నది ప్రక్కన పెడితే సృష్టిలో ప్రధమంగా ఏర్పడ్డది పదార్థం. మనస్సు, జీవం నశించినా, అది కడవరకు నిలుస్తుంది. అది నశించినప్పుడు అన్నీ నశించిపోయినట్లే. మిగిలినదంతా దాని నుండి ఉద్భవించవలసిందే.
‘పదార్థం’ అన్న సువిశాల క్షేత్రంలో, మనస్సు
మమకారంతో పెంచుకున్న పూవు నీ ఆత్మ
అది పెరిగిన చెట్టుపైనే నశించిపోతుంది -అంటారు శ్రీ శార్వరి.
జీవుని రూపాలకు తిరిగి జన్మించే హక్కులేదు, కాని ఆత్మ మరల మరల జన్మిస్తుంది అన్నది అందరూ నమ్మేవిషయం.
ప్రేమ-మృత్యువు
కొందరు పరాశక్తిని ప్రశ్నిస్తారు. అసలు పరమాత్మ, ఈశ్వరుడే లేడంటే అర్థం ఏమిటి? ఈ సూర్యచంద్రుల విలాసం, ఈ సుందర ఆకాశం, ఈ నక్షత్రాలు, చలనాలు, ఈ గాలి నీరు వెలుగు ఇవన్నీ ఎక్కడికవి? ఈ పరమాద్భుత సౌందర్యమే పరమాత్మ కాదా! అంటారు శ్రీ అరవిందులు.
సత్యవంతుడంటే ఒక వ్యక్తిగాదు ‘సత్యం’ శివం, సుందరం. సావిత్రికి తన మార్గం, గమ్యం స్పష్టంగా తెలుసు. సత్యవంతుడే తనకు సహచరుడు. తనకు జన్మజన్మల పతి సత్యవంతుడే. అతనికి సతి తాను.
ఓ కాలపురుషా! నేను సత్యవంతుని సజీవంగా కావాలని కోరడం నాహృదయానందం కోసం కాదు. నా శరీర సుఖాల కోసం కానే కాదు. అది తన లక్ష్యం నా లక్ష్యం, కలిసి జీవించాలనే ఇరువురి జీవిత లక్ష్యం నెరవేరడానికి.
ఈ లోకంలో మేము ఈశ్వరుని ప్రతినిధులం
మృత్యువు నీడలోనే మసలాలని మాకు తెలుసు
కాని ఈశ్వర ప్రజ్ఞను అంధకార లోకానికి అందించాలి
శూన్య మానవ హృదయాలను ఈశ్వర ప్రేమతో పూరించాలి
ఆయన కరుణా స్పర్శతో విశ్వవిషాదాన్ని తొలగించాలి
నేను జగన్మాతను అయిన పరబ్రహ్మ శక్తిని నేను
సత్యవంతుడు మనిషిలోని పరబ్రహ్మకు ప్రతినిధి.
కల-ఇల
ఈ భౌతిక ప్రపంచం పరమాత్మకు ఆవాసం కాదు. ఊహాజనితంగానో, ఆత్మ చైతన్యంతోనో దివ్యత్వాన్ని దర్శించాలేగాని వాస్తవికతలో కాదు. కనిపించే లోకానికి, కనిపించనిదేదో ఆధారం అని, ఏ అదృశ్య శక్తో సమస్త సృష్టిని నడిపిస్తోందని అందరూ నమ్ముతారు. అందుకే మనిషి పశుపక్షాదులకు భిన్నంగా వెలుగుబాటలో దివ్యత్వం, అమరత్వం సాధించాలని కోరుకుంటాడు.
“అసంభవమైతే ఆత్మ ఆరాటానికి అర్ధం లేదు” అంటారు అరవిందులు. చైతన్య రాహిత్య సూత్రం పశుజాతులకు వర్తిస్తుంది కానీ మనిషి అందుకు భిన్నంగా సదా మార్పు, పురోగతి, అభ్యున్నతి కోరుకుంటాడు. అది దైనందిన జీవితంలో కావచ్చు లేదా దివ్య జీవనానికి కావచ్చు.
“మనిషి మట్టిలో పుట్టినా, ఆలోచన స్వర్గం గురించి”.
ఒకవైపు మాత్రమే చూడగల కళ్ళకు పూర్ణత్వం కనిపించదు. అలాగే మనిషి బాహ్యాన్ని చూసి ఆంతర్యపు లోతులు విస్మరిస్తాడు. నిశ్చల నీరాలలో సూర్యుని బింబం స్పష్టంగా కనిపిస్తుంది అలాగే దివ్యత్వం అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఆత్మజ్ఞానం అవసరం.
హేతువాదంతో సత్య రహస్యం కనువిప్పు కాదు
భౌతిక రూపాలలో సత్య స్వరూపం ఆవిష్కరించబడదు
తాత్విక జీవులకు మాత్రమే సత్యం దర్శనమిస్తుంది
అదే ప్రకృతిగా, ప్రకృతి ధర్మంగా భాసిస్తుంది.
అలాగే మహాపధ నిర్వాణ స్ధితిని కొందరే చేయగలరు
మహాజ్వాల కాంతిరేఖల్ని కొందరే దాటగలరు.
పరమాత్మ సందేశాలను అందరూ అందుకోలేరు
జ్ఞాన తేజస్సుతో కొందరే సుస్నాతులు కాగలరు.
“మా ఆత్మలు పరమాత్మ సత్యాన్ని చూడగలిగితే
ప్రేమించగలిగితే అందుకోగలిగితే
ఆ అనంతకాంతి మా హృదయాలలో ప్రవేశిస్తే
పరబ్రహ్మ తత్వంతో జీవితం పునీతమవుతుంది
భౌతిక జీవనం దివ్య జీవనంగా మారిపోతుంది” అంటారు శ్రీ శార్వరి.
సావిత్రిది అకుంఠిత దీక్ష. అసమానమైన సాహసంతో చివరికి సత్యవంతుడి ప్రాణాలు దక్కించుకుంది. పరమాత్ముని దీర్ఘనిద్ర అనంతరం ఉషస్సులా అది మానవాళికి మహోదయం. సావిత్రి సాధించినది కాల్పనికమా, మాంత్రికమా, తాంత్రికమా, ఆత్మానుగతమా అన్నది పక్కనబెడితే ప్రతి ఒక్కర్ని అబ్బురపరిచే అద్భుతమైన ఇతివృత్తం. అనుభూతికి అందే ప్రతి విషయంలోనూ ఆనందం వుంటుంది. అలాగే సావిత్రి సత్యవంతుల కథ ఆత్మపొందే అనుభవం అందుకే ఆనందం కలిగిస్తుంది.
(మహాపర నిర్వాణం సమీక్షతో మళ్ళీ కలుద్దాం.)
Dr. Ramana V. Vasili
Spiritual Foundation
7062 Beringer Dr. S.
Cordova, Tennessee 38018, USA
Cell: 901-387-9646
ramanavvasili@hotmail.com
ఇవి కూడా చదవండి








