“చెదిరిన శ్వేత సౌధ స్వప్నం-హిల్లరీ క్లింటన్-ఒక పరిచయం” గ్రంధావిష్కరణ
డెట్రాయిట్ నగరంలోని ఆరోమా ఇండియన్ రెస్టారెంట్ బాంక్వెట్ హాలులో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘చెదిరిన శ్వేత సౌధ స్వప్నం-హిల్లరీ క్లింటన్-ఒక పరిచయం”గ్రంధావిష్కరణ కార్యక్రమం జరిగింధి.
తానా మాజీ అధ్యక్షుడు డా.బండ్ల హనుమయ్య అధ్యక్షత వహించారు. తానా వ్యవస్థాపకులలో ఒకరైన అమెరికాలో తెలుగు ప్రముఖులుడా.ముక్కామల అప్పారావు ఈ గ్రంధాన్ని ఆవిష్కరించారు. కంప్యూటెక్ చైర్మన్ కంచర్ల రామకృష్ణకు యార్లగడ్డ ఈ గ్రంధాన్ని అంకితమిచ్చారు. ఇటువంటి జీవన పరిచయ గ్రంధాలనురాసి యార్లగడ్డ ఇక్కడి తెలుగు వారి పిల్లలలో తెలుగు భాషపట్ల, స్థానిక అంశాలపట్ల కుతూహలాన్ని రేకెత్తిస్తున్నారని డా.బండ్ల హనుమయ్య అభినందించారు. భారత-అమెరికాల మధ్య సాహిత్య, సాంస్కృతిక వారధిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నిలుస్తారని డా.ముక్కామల అన్నారు.
కృతి స్వీకర్త కంచర్ల రామకృష్ణ మాట్లాడుతూ యార్లగడ్డ కంటే తానుచిన్నవాడినని, యార్లగడ్డ తల్లిదండ్రుల వద్ద తాను 50 సంవత్సరాల క్రితం గుడివాడ దగ్గర బేతవోలు గ్రామంలో విద్యనభ్యసించానని గుర్తు చేసుకున్నారు. రచయిత యార్లగడ్డమాట్లాడుతూ హిల్లరీ క్లింటన్ అమెరికా ప్రథమ మహిళగా, న్యూయార్క్ నగర సెనేటర్‌గా, ఒబామా ప్రభుత్వంలో విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసి ప్రపంచవ్యాప్తంగా మన్ననలుపొందారన్నారు. కుటుంబంలో సమస్యలు తలెత్తినప్పుడు ఎంతో హుందాగా భారతీయ మహిళల వలే సంయమనంతో, సంస్కారంతో వ్యవహరించేవారని హిల్లరీని కొనియాడారు. ఇదిరాజకీయ రచన కాదని, చారిత్రక, సామాజిక నేపథ్యంలో రాసిందని పేర్కొన్నారు.
తానా మాజీ అధ్యక్షుడు నాదెండ్ల గంగాధర్, డా.బిక్కిన శాయి రమేష్, డా.కోనేరు సునీల్, తానా పత్రిక సంపాదకుడు నారాయణస్వామి, తానా మిషిగన్ ప్రాంతీయ ప్రతినిధియార్లగడ్డ శివరాం, సినీ నిర్మాత, నటుడు డా.పోలిచర్ల హరనాధ్, సునీల్ పంత్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













