ఎపి జన్మభూమి ఆధ్వర్వంలో ప్రభుత్వ స్కూల్ పిల్లలతో ఎన్నారైల ముఖాముఖీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి జన్మభూమితో ఎన్నారైలను అనుసంధానించేలా కార్యక్రమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ఎపి జన్మభూమి ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్నారైల సహకారంతో డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ఇప్పుడు ఎన్నారైలతో స్వయంగా ప్రభుత్వ స్కూల్ పిల్లలు మాట్లాడేలా ఎన్నారై స్కూల్ కనెక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కడప, కర్నూలు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ?కార్యక్రమాన్ని తొలివిడతగా ప్రారంభించారు. దీనివల్ల ఎన్నారైలు ప్రభుత్వ స్కూల్ పిల్లల చదువుతీరును తెలుసుకోవడంతోపాటు వారి తెలివితేటలను, వారికి కావాల్సిన సౌకర్యాల కల్పనను తెలుసుకునే అవకాశం కలుగుతుందని జయరామ్ కోమటి చెప్పారు.
టెక్సాస్‌లో ఉన్న ఎన్నారై శివాజీ మాట్లాడుతూ ఎన్నారైలు తాము గడించిన అనుభవాలను క్రోడీకరించి లక్ష్యాన్ని సాధించడానికి విద్యార్థులకు అవసరమైన సందేశాన్ని అందించడంతోపాటు, అక్కడి స్కూళ్ళలో కావాల్సిన సౌకర్యాల కల్పనకు ఎన్నారైలుగా తమవంతు తోడ్పాటును అందించేందుకు ఇలాంటి కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. ప్రకాశం జిల్లాలోని పామూరులోని ప్రభుత్వ స్కూల్లో తొలి కార్యక్రమాన్ని జయరామ్ కోమటి ప్రారంభించి మాట్లాడారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, కడపలోని ఎంసి హైస్కూల్, మచిలీపట్నంలోని రామ్‌జీ హైస్కూల్, కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులోని మాచినేని సోమప్ప జడ్పి హైస్కూల్ విద్యార్థులు ఈ?ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు.













