తప్పు చేయలేదు కానీ నోటీసులు
ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రేయసి అనుష్క శర్మకు బృహణ్ ముంబయి కార్పొరేషన్ నోటీసులు పంపించింది. నలుగురు నడిచే దారిలో తన ఇంటికోసం ఎలక్ట్రిక్ జంక్షన్ బాక్స్ ఏర్పాటుచేయడం, అది కూడా ముందస్తు అనుమతి లేకుండా దానిని పెట్టడంతో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే, అనుష్క శర్మ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చింది.
సుబర్బన్ వార్సోవా ప్రాంతంలో బద్రినాథ్ టవర్ హౌసింగ్ సొసైటీలో 20వ అంతస్తులో అనుష్క శర్మ ఉంటోంది. అయితే, తన ప్లాట్కోసం నలుగురు నడిచే మార్గంలో ఎలక్ట్రిక్ బాక్స్ ఏర్పాటుచేసినట్లు అదే హౌసింగ్ సొసైటీలో ఉంటున్న వ్యక్తి బీఎంసీకి ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు ఈ విషయం ముందుగా తమకు ఎందుకు తెలియజేయలేదో వివరణ ఇవ్వాలని, ఉన్నపలంగా ఎలక్ట్రిక్ బాక్స్ అక్కడి నుంచి తొలగించాలని, లేదంటే తగిన విధంగా చర్యలు తీసుకుంటామని బీఎంసీ హెచ్చరించింది. అయితే నోటీసులు అనుష్క శర్మ పేరిట పంపించకుండా ప్లాట్ నెంబర్ 2001, 2002 అని పేర్కొంటూ పంపించారంట. దీనికి సంబంధించిన నటి తరపున అధికార ప్రతినిధి స్పందిస్తూ తాము చట్ట విరుద్ధంగా ఏది చేయలేదని, అనుష్కకు మొత్తం మూడు ప్లాట్లు ఉన్నాయని, 2013 నుంచి అన్ని అనుమతులను తీసుకొని అందులో ఉంటున్నారని, ఏ ఒక్కరికీ హానీ చేసే కుటుంబ వారిది కాదని, చట్టానికి నిబద్ధులై ఉంటారని తెలిపారు.













