బ్యాంకు లోన్ కట్టలేదని భయపడుతున్నారా..జప్తు నుంచి రక్షణ ఇచ్చే పథకాలు ఇవే!
Loan Recovery Rules: ప్రస్తుత కాలంలో అవసరాల నిమిత్తం రుణాలు తీసుకోవడం పెరిగింది. అయితే అనుకోని పరిస్థితుల వల్ల లోన్ తిరిగి చెల్లించలేకపోతే బ్యాంకులు ఆస్తులను స్వాధీనం చేసుకుంటాయని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. సాధారణంగా లోన్ కోసం షూరిటీగా పెట్టిన ఆస్తులపై బ్యాంకులకు హక్కు ఉన్నప్పటికీ, కొన్ని నిర్దిష్ట పొదుపు పథకాలను చట్టం రక్షిస్తుంది.
బ్యాంకులు జప్తు చేయలేని పథకాలు..
ప్రధానంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి పథకాల్లో ఉన్న డబ్బును బ్యాంకులు జప్తు చేయలేవు. ఇవి వ్యక్తిగత భవిష్యత్తు భద్రత కోసం ఉద్దేశించినవి కాబట్టి, కోర్టు ఉత్తర్వులు ఉన్నా వీటిని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదు. అలాగే గ్రాట్యుటీ, పెన్షన్ , NPS టైర్-1 ఖాతాలోని నిధులకు కూడా పూర్తి రక్షణ ఉంటుంది.
ఇవి కూడా చదవండి
రికవరీ కింద స్వాధీనం..
మనం ఏ ఆస్తినైతే బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందుతామో, వాటిని రికవరీ కింద బ్యాంకులు స్వాధీనం చేసుకుంటాయి. ఉదాహరణకు హోమ్ లోన్ కట్టకపోతే ఇల్లు, గోల్డ్ లోన్ చెల్లించకపోతే బంగారం వేలం వేస్తారు. సాధారణ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలు , ఇతర చిన్న పొదుపు పథకాలకు ఈ రక్షణ వర్తించదు.
జప్తు కాకుండా రక్షణ కవచంలా..
ఒక వ్యక్తి ఆర్థికంగా చితికిపోయినా, అతని ప్రాథమిక జీవనాధారానికి , కుటుంబ అవసరాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిబంధనలు రూపొందించారు. ఇన్సూరెన్స్ పాలసీలు , సామాజిక భద్రత కిందకు వచ్చే రిటైర్మెంట్ ఫండ్స్ బాకీల కింద జప్తు కాకుండా చట్టం రక్షణ కవచంలా నిలుస్తుంది.








