చండీగఢ్‌లో చుక్కలు చూపిస్తారా..? పంజాబ్ కింగ్స్ టాప్ గేర్..!
ఐపీఎల్ 2026 సీజన్లో నేడు జరగబోయే రెండో పోరులో పంజాబ్ కింగ్స్ (PBKS), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తలపడనున్నాయి. చండీగఢ్‌లోని ముల్లన్పూర్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఈ సీజన్లో అంచనాలకు మించి రాణిస్తున్న పంజాబ్ కింగ్స్, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం. మరోవైపు, తమ ఫామ్ కోసం కష్టపడుతున్న లక్నోకు ఈ మ్యాచ్ కాస్త ఇబ్బందికరమే.
పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో అజేయంగా కనిపిస్తోంది. ఆడిన మ్యాచ్‌ల్లో సమిష్టిగా రాణిస్తూ ప్రత్యర్థులకు చమటలు పట్టిస్తోంది. పంజాబ్ బ్యాటర్లు పవర్ ప్లేలోనే విరుచుకుపడుతుండటంతో భారీ స్కోర్లు సులభంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ పంజాబ్‌కు కొండంత బలాన్నిస్తోంది. పాయింట్ల పట్టికలో తన నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని పంజాబ్ భావిస్తోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ మైదానంలో సరైన ఫలితాలు రావడం లేదు. షాన్ మార్ష్, పంత్, పూరన్ వంటి వాళ్ళు ఫాంలోకి రావాల్సి ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లో వైఫల్యం జట్టును వెంటాడుతోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్‌ను ఢీకొట్టాలంటే లక్నో తన వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక బ్యాటింగ్ లో అయ్యర్, ప్రభ్ సిమ్రాన్ సింగ్ వంటి వాళ్ళతో పంజాబ్ బలంగా కనపడుతోంది. ఇక ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో లక్నో క్రమశిక్షణ పాటించకపోతే, ముల్లన్పూర్ పిచ్‌పై పంజాబ్ హిట్టర్లను ఆపడం అసాధ్యం.
ముల్లన్పూర్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది, అయితే రాత్రి పూట మ్యాచ్ కావడంతో మంచు (Dew) ప్రభావం కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుని, లక్ష్యాన్ని ఛేదించాలని చూస్తుంది. గత రికార్డులు మరియు ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే పంజాబ్ కింగ్స్ విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ, లక్నో అనూహ్యంగా పుంజుకుంటే మాత్రం క్రికెట్ ఫ్యాన్స్‌కు అసలైన మజా దొరుకుతుంది.








