ఐపిఎల్ లో నేడు బిగ్ ఫైట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్లు, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడనున్నాయి. ఐపీఎల్ అభిమానులు ‘ఎల్ క్లాసికో’గా అభివర్ణించే ఈ పోరుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇరు జట్లు ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచినప్పటికీ, ప్రస్తుత సీజన్లో పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉండటంతో, ఈ మ్యాచ్ గెలిచి మళ్ళీ ఫామ్‌లోకి రావాలని పట్టుదలతో ఉన్నాయి.
గత గణాంకాలను పరిశీలిస్తే, ముంబై ఇండియన్స్ జట్టు చెన్నైపై కాస్త డామినేషన్ ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు జరిగిన మొత్తం మ్యాచ్‌లలో ముంబై 22 సార్లు విజయం సాధించగా, చెన్నై 19 సార్లు గెలిచింది. ముఖ్యంగా ఐపీఎల్ ఫైనల్స్ వంటి కీలక సమయాల్లో ముంబైదే పైచేయిగా నిలిచింది. అయితే, గత ఐదు మ్యాచుల రికార్డులను చూస్తే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు విజయాలతో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. వాంఖడే స్టేడియం ముంబైకి హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ, ఇక్కడ చెన్నై రికార్డు కూడా మెరుగ్గానే ఉండటం విశేషం.
వ్యక్తిగత ఆటగాళ్ల విషయానికి వస్తే, రోహిత్ శర్మ(Rohith Sharma) ఈ పోరులో.. చెన్నైపై అత్యధికంగా 913 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. బౌలింగ్‌లో మాజీ ఆటగాళ్ళు లసిత్ మలింగ, డ్వేన్ బ్రావో చెరో 37 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ప్రస్తుత 2026 సీజన్లో రెండు జట్లు ఆడిన ఆరు మ్యాచులలో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించాయి. దీంతో ప్లే-ఆఫ్ రేసులో నిలవాలంటే నేటి మ్యాచ్ ఫలితం ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది. వాంఖడే పిచ్ సాధారణంగా బ్యాటర్లకు స్వర్గధామంలా ఉంటుంది.
ఇక్కడి చిన్న బౌండరీల కారణంగా భారీ సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో ధోనీ(Dhoni) ఆడతాడా లేదా అనే దానిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బుమ్రా(Bumrah) బౌలింగ్ మరియు రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ మధ్య జరిగే పోరు ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలవనుంది.
ఇవి కూడా చదవండి








