ఐపీఎల్లో ‘బాలకార్మిక’ రచ్చ.. సూర్యవంశీపై సామాజిక కార్యకర్త సంచలన వ్యాఖ్యలు..!
గత ఏడాది ఐపీఎల్(IPL) వేలంలో అందరి దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఒక ఊహించని వివాదంలో చిక్కుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్(Rajasthan royals) జట్టు రూ. 1.10 కోట్లకు ఈ చిన్నారిని కొనుగోలు చేయడంపై శివకుమార్ అనే ఒక సామాజిక కార్యకర్త చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. వైభవ్ ఐపీఎల్లో ఆడటం “బాలకార్మిక వ్యవస్థ” (Child Labour) కిందకు వస్తుందని సదరు కార్యకర్త వాదించడం చర్చనీయాంశమైంది.
తాజాగా కన్నడ ఛానెల్లో శివకుమార్ నాయక్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవడాన్ని ఆయన “బాలకార్మిక వ్యవస్థ”గా అభివర్ణిస్తూ రాజస్థాన్ రాయల్స్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసారు. ఒకవైపు భారీ వ్యాపార ఒప్పందాలు, మరోవైపు ఈ వింత వివాదంతో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సాధారణంగా 14 ఏళ్ల వయసులో పిల్లలు పాఠశాలల్లో చదువుకోవాలని, అటువంటి వయసులో ఉన్న బాలుడిని కోట్లాది రూపాయల కాంట్రాక్టుతో ఒక ప్రొఫెషనల్ లీగ్‌లో ఆడించడం చట్టవిరుద్ధమని సదరు కార్యకర్త పేర్కొన్నారు.
“ఇది ముమ్మాటికీ బాలకార్మిక వ్యవస్థే.. ఒక పిల్లాడిని పనిలో పెట్టుకుని డబ్బు సంపాదించడం చట్టం దృష్టిలో నేరం” అంటూ చేసిన వింత వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీపై విమర్శల జడివాన మొదలైంది. అయితే, ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మరియు క్రికెట్ విశ్లేషకులు తీవ్రంగా మండిపడుతున్నారు. క్రీడలను వృత్తిగా ఎంచుకోవడం, అందులో ప్రతిభను చాటుకోవడం బాలకార్మిక వ్యవస్థ కిందకు ఎలా వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి క్రీడల్లో టీనేజర్లు తలపడటం సర్వసాధారణమని, దీన్ని తప్పుగా చూడటం సమంజసం కాదని వాదిస్తున్నారు. వైభవ్ ఇప్పటికే రంజీ ట్రోఫీలో ఆడి తన సత్తా చాటుకున్నాడని వారు గుర్తు చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతని బ్యాటింగ్ శైలిని చూసి వెటరన్ క్రికెటర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి వివాదాలు అతని కెరీర్‌పై ప్రభావం చూపుతాయేమోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై అటు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం గానీ, ఇటు బీసీసీఐ (BCCI) గానీ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి








