తెలంగాణలో మరో అద్భుత కట్టడం.. బౌద్ధ సంస్కృతికి అద్దం పట్టేలా రూపుదిద్దుకుంటున్న బుద్ధవనం!
Buddhist Tourism: గౌతమ బుద్ధుడు జీవించిన కాలం నుండే బౌద్ధం వర్ధిల్లిన ఈ ప్రాంతంలో, బౌద్ధ వారసత్వ సంపదను ప్రపంచానికి చాటిచెప్పేందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలోని బౌద్ధ చారిత్రక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లను అందుబాటులోకి తీసుకురానుంది.
బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్..
కృష్ణా నది ఒడ్డున నాగార్జునసాగర్ సమీపంలో 274 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ ‘బుద్ధవనం’ రూపుదిద్దుకుంటోంది. ఇందులో ఎనిమిది విభాగాలు ఉండగా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘బుద్దిస్ట్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ మ్యూజియం’ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ మ్యూజియంలో ఆధునిక సాంకేతికత ద్వారా భారత్, శ్రీలంక, థాయ్లాండ్ వంటి దేశాల్లోని 70 ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రాలను సందర్శకులు వీక్షించవచ్చు.
ఆకర్షణలు..
- పురాతన అమరావతి మహాస్తూపం నమూనా ఆధారంగా దీనిని నిర్మించారు.
- బుద్ధుడి జీవిత ఘట్టాలతో కూడిన ప్రత్యేక ప్రాంతం సందర్శకులను ఆకట్టుకుంటోంది.
- నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్స్ పక్కన ధ్యానం చేసుకోవడానికి ప్రశాంతమైన కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- శ్రీలంక ప్రభుత్వం అందజేసిన 27 అడుగుల ఎత్తైన ప్రతిరూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.
పర్యాటకులను ఆకర్షించేలా..
తెలంగాణలోని బుద్ధవనం, కొండాపూర్, ధూళికట్ట వంటి ప్రాంతాలను భారతీయులతో పాటు ఇతర దేశాల పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు. బౌద్ధ వారసత్వ సంపదను పరిరక్షించడంతో పాటు, ఆగ్నేయాసియా దేశాల నుండి పర్యాటకులను ఆకర్షించేలా ఇక్కడ అత్యాధునిక వసతులు కల్పిస్తున్నట్లు బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ఇప్పటికే ఇక్కడ నిర్వహించిన అంతర్జాతీయ బౌద్ధ శాంతి సదస్సులో 22 దేశాల ప్రతినిధులు పాల్గొనడం గమనార్హం.








