అల్పాహారం.. జేబుకు భారం.. వాణిజ్య గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుడిపై గండం!
Gas Cylinder: నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరగడంతో, హోటళ్లు, టీఫిన్ సెంటర్లు పిజి (PG) వసతి గృహాల్లో అల్పాహారం నుండి భోజనం వరకు అన్నింటి ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. ప్రస్తుత ధరల పెరుగుదల వల్ల హోటల్ యజమానులు తమ వ్యాపారాన్ని కొనసాగించడం కష్టతరంగా మారింది. వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా రూ. 3,314 కి చేరడంతో, ఇడ్లీ, వడ, దోశ వంటి టిఫిన్లపై రూ. 5 నుండి రూ. 10 వరకు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది.
మళ్లీ కట్టెల పొయ్యిలను..
ధరల భారాన్ని తట్టుకోలేక చాలా మంది టిఫిన్ సెంటర్ల యజమానులు గ్యాస్ స్టౌలను పక్కనపెట్టి, మళ్లీ పాతబడిన కట్టెల పొయ్యిలను వినియోగిస్తున్నారు. అమీర్పేట, దిల్సుఖ్నగర్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఇది కేవలం హోటళ్లకే పరిమితం కాలేదు, పిజి హాస్టళ్లలో కూడా వడ్డించే భోజనం టిఫిన్ల ధరలు భారీగా పెరిగాయి. నెలకు ఉండే మెస్ ఛార్జీలను యాజమాన్యాలు ఇప్పటికే రూ. 1,000 నుండి రూ. 1,500 వరకు పెంచేశాయి. ఈ పెంపుతో తక్కువ వేతనాలతో జీవించే ఉద్యోగులు విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
హాస్టల్ వదిలి సొంతూళ్లకు వెళ్లాల్సిందేనని..
నిరుద్యోగులు చిరుద్యోగులు తమ రోజువారీ బడ్జెట్ను ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. మరోవైపు, చిన్న హోటళ్లు కనీసం 5 కేజీల సిలిండర్లను వాడుకుందామన్నా అవి దొరకడం గగనంగా మారింది. దొరికినా, వాటికి కూడా అదనంగా రూ. 800 వరకు వసూలు చేస్తున్నారని హోటల్ యజమానులు వాపోతున్నారు. ధరలను మరోసారి పెంచితే హాస్టల్ వదిలి సొంతూళ్లకు వెళ్లాల్సిందేనని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని వాణిజ్య గ్యాస్ ధరలను నియంత్రించాలని, లేదంటే హోటల్ పరిశ్రమ విద్యార్థుల బడ్జెట్ పూర్తిగా కుప్పకూలుతుందని యజమానులు, ప్రజలు కోరుతున్నారు.








