మండే ఎండల్లో విద్యుత్ భరోసా.. కొత్త సబ్స్టేషన్లు సిద్ధం!
Hyderabad: నగరంలో ఎండలు తీవ్రమవ్వడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను నిరంతరాయంగా వాడుతుండటంతో కరెంట్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం శివార్లలో 43 డిగ్రీల పైన, నగరంలో 42 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మిర్యాలగూడ ఘటనతో అప్రమత్తం..
ఇటీవల మిర్యాలగూడలోని ఒక విద్యుత్ ఉపకేంద్రంలో పవర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితులు రాకుండా లోడ్ 80 శాతం దాటకుండా విద్యుత్ ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
తీసుకుంటున్న ముందస్తు చర్యలు..
సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ప్రతి సర్కిల్లో 100కు పైగా కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను (DTR) ఏర్పాటు చేశారు. అదనంగా మరో 50 కేటాయించాలని అధికారులు కోరారు. లోడ్‌ను తట్టుకునేందుకు ప్రతి సర్కిల్లో 15 నుంచి 20 వరకు 11 కేవీ ఫీడర్లను విభజించారు. 150 యాంప్స్ మించిన ఫీడర్లను వేరు చేసి కొత్తవి ఏర్పాటు చేశారు. విద్యుత్ ఉపకేంద్రాల్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ల (PTR) సామర్థ్యాన్ని పెంచడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తున్నారు.
కొత్త ఉపకేంద్రాల ఏర్పాట్లు..
వేసవి ప్రణాళికలో భాగంగా కొత్త ఉపకేంద్రాల నిర్మాణం చేపట్టినట్లు హైదరాబాద్ సౌత్ సర్కిల్ ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. అత్తాపూర్‌లో నూతన ఉపకేంద్రం సిద్ధమైందని, దీనివల్ల అత్తాపూర్, హైదర్‌గూడ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని ఆయన వెల్లడించారు. గ్యాస్ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌల వాడకం పెరిగి, పాతబస్తీలో డిమాండ్ 10 శాతం పెరిగిందని అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి








