రైల్వేస్టేషన్లో ‘యాక్సెస్ కంట్రోల్’.. ఇక పార్కింగ్ కష్టాలకు చెక్!
Railway: చర్లపల్లి రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ‘యాక్సెస్ కంట్రోల్‘ వ్యవస్థను ప్రవేశపెట్టింది. వాహనాల రద్దీని క్రమబద్ధీకరించడానికి , అనధికార పార్కింగ్‌ను అరికట్టడానికి 2, 3 , 4 చక్రాల వాహనాల కోసం విడివిడిగా ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులను దించడానికి లేదా ఎక్కించుకోవడానికి వచ్చే వాహనాలు నిర్ణీత లేన్లలోనే వెళ్లాల్సి ఉంటుంది.
డిజిటల్ టికెటింగ్ ..
ఈ నూతన విధానంలో భాగంగా స్టేషన్లోకి ప్రవేశించే ప్రతి వాహనానికి డిజిటల్ టికెట్ జారీ చేస్తారు. మొదటి 20 నిమిషాల లోపు స్టేషన్ నుంచి నిష్క్రమిస్తే ఎలాంటి ఛార్జీ ఉండదు. అయితే 20 నిమిషాలు దాటిన తర్వాత వాహన రకాన్ని బట్టి ఛార్జీలు విధిస్తారు. 60 నిమిషాలు దాటితే గరిష్టంగా 500 రూపాయల వరకు ఛార్జీ పడుతుంది. ఇక వాణిజ్య వాహనాలైన బస్సులు, మినీ బస్సులు గంట కంటే ఎక్కువ సమయం లోపల ఉంటే 1000 రూపాయల భారీ జరిమానా తప్పదు.
గంటల ప్రాతిపదికన పార్కింగ్ సౌకర్యం..
కేవలం డ్రాప్-ఆఫ్, పికప్ మాత్రమే కాకుండా, వాహనాలను ఎక్కువ సమయం నిలిపి ఉంచే వారి కోసం గంటల ప్రాతిపదికన పార్కింగ్ సదుపాయం కల్పించారు. కార్లకు మొదటి రెండు గంటలకు 20 రూపాయలు, ద్విచక్ర వాహనాలకు 15 రూపాయలుగా ఛార్జీలు నిర్ణయించారు. ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా స్టేషన్ ప్రాంగణంలో పారదర్శకత పెరగడమే కాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి








