చట్టం ప్రకారమే కూల్చివేతలు..హైకోర్టు ఆదేశాలతో హైడ్రా వ్యూహంలో మార్పు!
HYDRAA: నగరంలో అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తున్న హైడ్రా (HYDRAA) తన పనితీరులో మార్పులు చేపట్టింది. గతంలో ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపట్టిన హైడ్రా, ఇప్పుడు చట్టపరమైన నిబంధనల ప్రకారం ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. సరైన ప్రక్రియను అనుసరించకుండా నేరుగా కూల్చివేతలు చేపట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా తన పంథాను మార్చుకుంది.
ముష్కిన్ చెరువు వద్ద కొత్త విధానం..
హైకోర్టు సూచనల మేరకు, కూల్చివేతలకు ముందు నోటీసులు ఇచ్చే ప్రక్రియను నార్సింగిలోని ముష్కిన్ చెరువు వద్ద ప్రారంభించారు. ఇక్కడ అక్రమ నిర్మాణాల తొలగింపునకు సంబంధించి ఎస్.ఓ.పి (Standard Operating Procedure) అమలుకు శ్రీకారం చుట్టారు. అదనపు కమిషనర్ వర్ల పాపయ్య చెరువును స్వయంగా పరిశీలించి, అక్కడ మట్టి నింపిన వారికి , నివాసం ఉంటున్న వారికి తగిన సమయం ఇస్తూ నోటీసులు జారీ చేశారు.
శిథిల భవనాలపై నిఘా..
ఇటీవల బెంగళూరులో భారీ వర్షాల వల్ల గోడ కూలి ఏడుగురు మరణించిన ఘటనను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్‌లో అటువంటి ప్రమాదాలు జరగకుండా హైడ్రా అప్రమత్తమైంది. నగరంలోని శిథిల భవనాలు లేదా ప్రమాదకరంగా ఉన్న కట్టడాల గురించి ప్రజలు సమాచారం అందించాలని కమిషనర్ ఏ.వి. రంగనాథ్ సూచించారు.
ఫిర్యాదు కొరకు కంట్రోల్ రూమ్ నంబర్..
ప్రమాదకర భవనాల గురించి ఫిర్యాదు చేసేందుకు హైడ్రా ఒక ప్రత్యేక నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఫోన్ నంబర్: 90001 13667








