ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లు ఇక్కడ జరగనివ్వొద్దు : సీఎం రేవంత్ రెడ్డి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట తెలంగాణలో ఓట్లు తొలగించాలని చూస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో జరిగినట్టుగా ఇక్కడ జరగనివ్వకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. నాంపల్లి లోని హజ్ హౌస్ (Hajj House) నుంచి బయలుదేరుతున్న హజ్ యాత్రికుల బస్సులను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా సర్ ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సంక్షేమం, అభివృద్ధిలో మైనారిటీల వాటాను వారికి అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో విమాన ప్రయాణ చార్జీలు పెరిగాయని, హజ్ యాత్రికులపై ఏటా అయ్యే ఖర్చు కంటే అదనంగా కొంత భారం పడుతోందని, పెరిగిన అదనపు ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. నిజానికి, హజ్ యాత్రకు వెళ్లే వారికి ఒక్కొక్కరికీ ఏటా అయ్యే ఖర్చు కంటే అదనంగా మరో రూ.10 వేలు ఎక్కువ అవసరమవుతాయని, ఆ మేరకు డబ్బులు సర్దుబాటు చేసుకోవాలని ఇండియా హజ్ కమిటీ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే, తెలంగాణ (Telangana) నుంచి హజ్ వెళ్లేందుకు నమోదు చేసుకున్న ప్రయాణికులకు ఒక్కొక్కరికీ పెరిగే అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. తమ ప్రభుత్వానికి హిందూ-ముస్లిం అనే భేదాభిప్రాయాలు లేవన్నారు.
గత ఏడాది హజ్ యాత్రకు వెళ్లి బస్సు ప్రమాదంలో 44మంది మరణించారని, మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకుందని గుర్తుచేశారు. విదేశీ విద్యలోనూ మైనారిటీలకు స్కాలర్ షిప్లు అందిస్తున్నామన్నారు. వైట్ కాలర్ ఉద్యోగాల కంటే, ప్రస్తుతం బ్లూ కాలర్ జాబ్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని, అమెరికా కంటే జర్మనీ, జపాన్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.








