రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కల్ల : బండి సంజయ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అహంకారంవల్లే ఆయన తండ్రి కేసీఆర్ (KCR) ఫాంహౌజ్ కు పరిమితమయ్యారని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. ప్రధాని రాక సందర్భంగా బండి నేతృత్వంలో ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి అమీర్ పేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ (BRS) ఏం చేసినా రాష్ట్రంలో ఇక అధికారంలోకి రావడం కల్ల అని అన్నారు. కేటీఆర్ ను చూసి బీఆర్ఎస్ కార్యకర్తలే అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. కేటీఆర్ మాదిరిగా దోచుకోవడం నాకు తెలియదు. మాకు ఏం తెలుసో ప్రజలు నిర్ణయిస్తారు. మీకు ఏం తెలుసో ప్రజలు గ్రహించి మిమ్మల్ని ఓడించారు అని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అహంకారం చూపించి, ఇప్పుడు అధికారం పోయాక కార్యకర్తల ఇళ్లకు వెళ్లి కాళ్లు మొక్కుతున్నారని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి తాము నిధులు తెస్తుంటే, కాంగ్రెస్ నేతలు తెలంగాణ సొమ్మును ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు పంపుతున్నారని ఆరోపించారు.








