మీ జీవితంలో ఎకరం భూమి ఇచ్చారా..? ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు..!
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలు పన్నుతోందని విశాఖ(Vizag) ఎంపీ భరత్(MP Bharath) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వైసీపీకి(YCP) ఇష్టం లేదని విమర్శించారు. ప్రస్తుతం ఏ అభివృద్ధి జరిగినా, గతంలో తామే దానికి పునాది వేశామని చెప్పుకుంటూ వైసీపీ నేతలు ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడుతున్నారని, ఇలాంటి నాటకాలు ఆడటం వారికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.
విశాఖపట్నం ఇప్పుడు పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని, నగరానికి ఐటీ దిగ్గజాలు క్యూ కడుతున్నాయని భరత్ పేర్కొన్నారు. గూగుల్(Google) వంటి అంతర్జాతీయ సంస్థ విశాఖకు రావడంతో మరిన్ని సంస్థలు గూగుల్ కార్యాలయానికి సమీపంలోనే స్థలాల కోసం కోరుతున్నాయని వెల్లడించారు. ఇప్పుడు వస్తున్న డేటా సెంటర్లు కేవలం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని భారీ పెట్టుబడులు రాబోతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
టీసీఎస్(TCS) వంటి దిగ్గజ సంస్థలకు తక్కువ ధరకు భూమి ఇవ్వడానికి కారణం, వారు అత్యంత వేగంగా విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించి ఉద్యోగ అవకాశాలు కల్పించడమేనని స్పష్టం చేశారు. రూ. 8 వేల కోట్ల పైబడి టర్నోవర్ ఉన్న సంస్థలకే ఈ రాయితీలు వర్తిస్తాయని తెలిపారు. వైసీపీ హయాంలో ఇన్ఫోసిస్ వంటి కంపెనీలకు ఏనాడైనా భూములు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని యువత సొంత కాళ్ల మీద ఎదగడం వైసీపీ నేతలకు ఇష్టం లేదని, అందుకే ప్రతి అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
రవాణా మరియు మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుందని భరత్ వివరించారు. ఈ ఎయిర్పోర్ట్ నుంచి రెండు వైపులా రాకపోకలు సాగించే వీలుంటుందని తెలిపారు. అలాగే రైల్వే జోన్ అందుబాటులోకి వస్తే విశాఖ నుంచి మరిన్ని కొత్త రైళ్లను అడిగే హక్కు ఉంటుందని, ముఖ్యంగా విశాఖ నుంచి తిరుపతికి ‘వందే భారత్'(Vande Bharath) రైలును కేటాయించాలని కోరనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా విశాఖ – బెంగళూరు మధ్య ప్రతిరోజూ సర్వీసులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి








