పన్ను కట్టినా తప్పని కష్టం.. ఆన్లైన్ సేవలతో వాహనదారులకు తప్పని తిప్పలు
RTA Portal: ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభతరం చేసేందుకు ప్రవేశపెట్టిన ఆన్లైన్ వ్యవస్థలు, సాంకేతిక లోపాల కారణంగా వాహనదారులకు శాపంగా మారుతున్నాయి. మీసేవ , రవాణా శాఖ (RTA) సర్వర్ల మధ్య సమన్వయ లోపంతో సకాలంలో డేటా అప్డేట్ కాకపోవడం తీవ్ర ఇబ్బందులకు దారితీస్తోంది.
పన్ను చెల్లించలేదంటూ వాహనం సీజ్..
నిబంధనల ప్రకారం పన్నులు, జరిమానాలు ఆన్లైన్లో చెల్లించినప్పటికీ, అధికారిక రికార్డుల్లో అవి వెంటనే ప్రతిబింబించడం లేదు. తాజాగా ఒక వాహనదారుడు ఏప్రిల్ 14న మీసేవ ద్వారా పన్ను చెల్లించి రసీదు పొందినప్పటికీ, రవాణా శాఖ సర్వర్లో ఆ వివరాలు నమోదు కాలేదు. మే 1న తనిఖీలు నిర్వహించిన మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI), రికార్డుల్లో పన్ను చెల్లించలేదని చూపిస్తోందంటూ సదరు వాహనాన్ని సీజ్ చేశారు.
వారాల తరబడి డేటా సింక్ జాప్యం..
మీసేవలో జరిపిన చెల్లింపులు ఆర్టీఏ సర్వర్లో కనిపించడానికి వారం రోజులకు పైగా సమయం పడుతుండటం వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతోంది. బాధితుల వద్ద సరైన పత్రాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి అధికారులు వాటిని పరిగణనలోకి తీసుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల వాహనదారులు తమ ఉపాధిని కోల్పోవడమే కాకుండా, వాహనాల్లోని సరుకు పాడైపోయి భారీగా నష్టపోతున్నారు.
పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ..:
ఒకసారి పేమెంట్ ఫెయిల్ అని వచ్చి, నగదు డెబిట్ అయితే.. ఆ మొత్తాన్ని తిరిగి పొందడానికి నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సర్వర్ల మధ్య డేటా సింక్ కావడానికి 24 గంటల నుండి కొన్ని వారాల సమయం పడుతుండటంతో సామాన్యులు బలి అవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి








