టీసీఏ స్వర్ణోత్సవాల వేడుక…ప్రముఖులకు ఆహ్వానాలు
కాన్సుల్ జనరల్ డి.సి.మంజునాథ్‌కు ఆహ్వానం
‘హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్‘ ప్రతిష్టాత్మక స్వర్ణోత్సవ మహాసభల (గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్ – 2026) ఏర్పాట్లు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. గత 50 ఏళ్ల తెలుగు ఐక్యత, అచంచల సేవా ప్రస్థానానికి నిదర్శనంగా నిలిచేలా ఈ స్వర్ణయుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది. చారిత్రక వేడుకలను విజయవంతం చేసేందుకు సుమారు 30 ప్రత్యేక కమిటీలు, 150 మందికి పైగా వాలంటీర్లు 3 నెలలుగా శ్రమిస్తున్నారు. మహాసభలకు విచ్చేసే ప్రతి ఒక్కరికీ ఒక మరపురాని, అద్భుతమైన అనుభూతిని అందించాలనే లక్ష్యంతో పక్కా ప్రణాళికలతో పనులను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ మహాసభలకు టీసీఏ అధ్యక్షులు యాదగిరి రెడ్డి, కన్వీనర్ జితేందర్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. వారితో పాటు టీసీఏ కన్వెన్షన్ కోర్ టీమ్ సభ్యులు ముందుండి అన్ని కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. ఫోర్ట్ బెండ్ ఎపిసెంటర్ వేదికగా ఆగస్టు 7 , 8 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుంది. “50 సంవత్సరాల సేవ… తెలుగు ఐక్యతకు స్వర్ణయుగ వేడుక!” అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ చారిత్రక స్వర్ణోత్సవాల్లో ప్రతీ తెలుగు కుటుంబం భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ తరలివచ్చి ఈ మహాసభలను విజయవంతం చేయాలని టీసీఏ కుటుంబం ఆహ్వానిస్తోంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి 2026–27 నూతన కార్యవర్గ ప్రతినిధులు ఒక ముఖ్యమైన అధికారిక సమావేశాన్ని నిర్వహించారు. టీసీఏ అధ్యక్షులు యాదగిరి రెడ్డి నేతృత్వంలోని కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, ప్రముఖులు చార్లీ చౌదరితో కలిసి భారత కాన్సుల్ జనరల్ డి.సి. మంజునాథ్‌ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ ప్రత్యేక సమావేశంలో ప్రవాసంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు, తెలుగు సమాజ ఐక్యతను బలోపేతం చేయడం , భావి తరాల యువతలో తెలుగు భాషాభిమానాన్ని పెంపొందించే పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో భాగంగా రాబోయే ఆగస్టు 7, 8 తేదీలలో జరగనున్న అత్యంత చారిత్రక టీసీఏ స్వర్ణోత్సవాల వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావలసిందిగా కాన్సుల్ జనరల్ గారిని కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భారత సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ 50 ఏళ్ల పండగను అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించేందుకు టీసీఏ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ప్రతినిధులు స్పష్టం చేశారు.
సాహితీవేత్తలకు ఆహ్వానం
హ్యూస్టన్ తెలుగు సంఘం గోల్డెన్ జూబ్లి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా సాహితీవేత్తలను ఆహ్వా నించారు. శ్రీనివాస్ అవసరాల, జొన్నవిత్తుల రామ లింగేశ్వరరావు, డా. అరుణ సుబ్బారావు, బులుసు అపర్ణ, డా. గరికపాటి గురజాడ తదితరులు ఉన్నారు.
కన్వెన్షన్ ముఖ్య కమిటీ సమావేశాలు
హ్యూస్టన్ తెలుగు సంఘం గోల్డెన్ జూబ్లి వేడుకలకు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. 1976లో ప్రారంభమై 2026కు 50 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు తొలుత హ్యూస్టన్ లోని ప్రముఖులు ముందుకు వచ్చారు. ప్రస్తుతం హ్యూస్టన్ తెలుగు అసోసియేషన్‌కి యాదగిరి రెడ్డి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు గోల్డెన్ జూబ్లి వేడుకలకోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. కన్వెన్షన్ కోర్ కమిటీలో జితేందర్ రెడ్డి (కన్వీనర్), యాదగిరి రెడ్డి (ప్రెసిడెంట్), రాజశేఖర్ యలమంచిలి (అడ్వయిజరీ కౌన్సిల్), గిరీష్ రామిరెడ్డి (ఎగ్జిక్యూటివ్ కో ఆర్డినేటర్), రాజ్ పసý (జనరల్ సెక్రటరీ), ప్రసాద్ మారగాని (ఈవెంట్ డైరెక్టర్), దామోదర్ జమ్మి (ట్రస్టీ), ప్రసాద్ కల్వ (ట్రస్టీ), రాము ఉప్పలపాటి (కన్వెన్షన్ ట్రజరర్), శ్రీధర్ కాంచనకుంట్ల (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), రవి గుణిశెట్టి (ఈవెంట్ కో ఆర్డినేటర్)గా ఉన్నారు. అడ్వయిజరీ కౌన్సిల్ కమిటీలో రాజశేఖర్ యలమంచిలి, చిట్టెన్ రాజు వంగూరి, మల్లిక్ పుచ్చా, జనార్థన్ రెడ్డి వింట, రవి తమిరిశ, కిరణ్ మద్దినేని ఉన్నారు. సెరిమోనియల్ కమిటీలో పద్మశ్రీ ముత్యాల, శారద ఆకునూరి, రమేష్ చెరివిరాల ఉన్నారు. టిసిఎ ట్రస్టీలుగా దామోదర్ జమ్మి, ఆశాజ్యోతి దేవకి, ఉషా రంగరాజ్ ఉన్నారు. కన్వెన్షన్ ట్రస్టీలుగా ప్రసాద్ కల్వ, బంగార్ రెడ్డి ఉన్నారు. అడ్వయిజరీ కమిటీలో రత్నకుమార్, బంగార్ రెడ్డి, రాజ్ చప్పిడి, రవి వర్రె, శ్రీధర్ పాటిబండ్ల, సతీష్ నన్నపనేని, వెంకట్ వీరిశెట్టి, రామ్ చెరువు, క్రాంతి నెద్నూర్, రమేష్ అకరపు ఉన్నారు. అడ్ హాక్ కమిటీలో రవి గుణిశెట్టి, శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. వీరంతా ఎప్పటికప్పుడు సమావేశాలను నిర్వహించుకుని సిల్వర్ జూబ్లి వేడుకలను ఘనంగా జరిపేందుకు చర్యలు చేపడుతున్నారు.
పిల్లలు, యువత కోసం ‘భగవద్గీత టాలెంట్ షో 2026’
పిల్లలు, యువతలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే ఉద్దేశ్యంతో టీసీఏ ఆధ్యాత్మిక కమిటీ ఆధ్వర్యంలో ‘భగవద్గీత టాలెంట్ షో 2026’ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ పోటీలు హనుమాన్ దత్త యోగా సెంటర్ వేదికగా జరగనున్నాయి. ఈ పోటీలలో భగవద్గీతలోని 12వ అధ్యాయం (భక్తి యోగం), 15వ అధ్యాయం (పురుషోత్తమ ప్రాప్తి యోగం) నుండి శ్లోకాలను కంఠస్థం చేయాల్సి ఉంటుంది. శ్లోకాలను పఠించడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ఆకర్షణీయమైన నగదు బహుమతులు, ట్రోఫీలు అందించబడతాయి.
ఆగస్టు 8న అమ్మ శ్రీ కరుణామయి దివ్య అనుగ్రహ భాషణం
ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, పూజ్యనీయులు అమ్మ శ్రీ కరుణామయి హ్యూస్టన్ పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా అమ్మ వారిచే ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచనం ఏర్పాటు చేసినట్లు టీసీఏ ఆధ్యాత్మిక కమిటీ ప్రకటించింది. టీసీఏ 50 ఏళ్ల మైలురాయిని చేరుకున్న శుభసందర్భంలో భక్తి, జ్ఞానం, దైవిక అనుభూతిని పెంపొందించే ఈ పవిత్ర సత్సంగానికి భక్తులందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక కూడలిలో పాల్గొని అమ్మ వారి దివ్యాశీస్సులు అందుకోవాలని నిర్వాహకులు కోరారు.
సీతారాముల కళ్యాణం
హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి ప్రతిష్టాత్మక 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఘనంగా ‘శ్రీ సీతారాముల కల్యాణం’ నిర్వహించనున్నారు. ఆగస్టు 8వ తేదీ శనివారం ఉదయం 6:00 గంటల నుండి 8:00 గంటల వరకు అత్యంత వైభవంగా ఈ కల్యాణ మహోత్సవాన్ని జరిపించనున్నారు. అర్చకులు శ్రీ హనుమాన్ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ పవిత్ర కల్యాణ క్రతువు శాస్త్రోక్తంగా జరగనుంది.








