ఎపిలో కూటమి పాలనకు రెండేళ్ళు
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో లభించిన అపూర్వమైన ప్రజా తీర్పుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. సంక్షేమ రథాన్ని, అభివృద్ధి చక్రాలను ఏకకాలంలో పరుగులు తీయించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవంతో నేడు ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంలో దూసుకుపోతోంది.
అమరావతి పునర్వైభవం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాధాన్యత ఇచ్చిన అత్యంత కీలకమైన అంశం- రాజధాని అమరావతి పునరుద్ధరణ. అమరావతి క్యాపిటల్ ఫేజ్-1 అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సంయుక్తంగా దాదాపు రూ. 13,000 కోట్లకు పైగా నిధులను కేటాయించాయి. ప్రస్తుతం అమరావతిలో కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్ పూర్తయ్యాయి. రాజధాని పరిధిలో వరద ముప్పును శాశ్వతంగా నివారించేందుకు రూపుదిద్దుకున్న ఫ్లడ్ మేనేజ్మెంట్ పనులు ఆరు కీలక ప్రాంతాలలో శరవేగంగా సాగుతున్నాయి. నాడు రోడ్డున పడ్డ రైతుల కళ్లల్లో ఆనందం నింపుతూ, 2028 చివరి నాటికి ఫేజ్-1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తి చేయడమే లక్ష్యంగా అమరావతిని గ్లోబల్ ఎకనామిక్ అండ్ డీప్ టెక్ హబ్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. అంతేకాక, రాజధానిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు మరింత ఎక్కువ భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పోలవరం పునర్నిర్మాణం
నవ్యాంధ్ర పాలిట జీవనాడి అయిన పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికిన పని చేస్తోంది. గోదావరి వరదల వల్ల దెబ్బతిన్న అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ మరమ్మతులను, రికార్డు సమయంలో పూర్తి చేయడం కూటమి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద ఇంజనీరింగ్ విజయం. కేంద్ర జలశక్తి శాఖ, అంతర్జాతీయ నిపుణుల కమిటీల పర్యవేక్షణలో గ్యాప్-2 ఎర్త్-కమ్-రాక్‌ఫిల్ డ్యామ్ పనులు ఊపందుకున్నాయి. మరోవైపు, నదికి కుడివైపున ఉన్న పోలవరం రైట్ మెయిన్ కెనాల్ పరిధిలో గతంలో నిలిచిపోయిన చిన్న చిన్న గ్యాప్ పనులను రూ.48 కోట్ల నుండి రూ. 56 కోట్ల వ్యయంతో ఈ ఏడాది జూన్-జూలై నాటికి పూర్తి చేస్తున్నారు. తద్వారా ఈ కాలువ నీటిని మోసుకెళ్లే సామర్థ్యం ప్రస్తుత 6,000 క్యూసెక్కుల నుండి ఏకంగా 17,500 క్యూసెక్కులకు పెరుగుతుంది. 960 మెగావాట్ల సామర్థ్యం గల జలవిద్యుత్ కేంద్రం పనులు కూడా వేగంగా కదులుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పూర్తి నిధుల హామీతో, జూన్ 2027 నాటికి ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా దేశానికి అంకితం చేసేందుకు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేతృత్వంలో పనులు పగలు రేయి సాగుతున్నాయి.
పెట్టుబడుల ప్రవాహం..
రూ. 23 లక్షల కోట్ల బ్లూప్రింట్
పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం దూసుకుపోతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాలలో దాదాపు 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రణాళికలతో 800 భారీ ప్రాజెక్టులను ప్రభుత్వం ట్రాక్ చేస్తోంది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని 24 లక్షల మంది యువతకు ఉపాధి లభించనుంది. దావోస్ పారిశ్రామిక సదస్సులో ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 84,000 కోట్లు) భారీ భాగస్వామ్య ఒప్పందాన్ని =వ్గీ సంస్థతో కుదుర్చుకుంది. దీని కింద డిజిటల్, ఇండస్ట్రియల్ అండ్ మిక్స్డ్-యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తారు. విశాఖపట్నంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కోసం 10 మిలియన్ చదరపు అడుగుల భారీ క్యాంపస్ ఏర్పాటు కాబోతోంది. అలాగే, ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్‌లోడ్‌లను నిర్వహించేందుకు 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అదానీతో కలిసి గూగుల్ సైతం ఇక్కడ ప్రత్యేక ఎఐ ఇన్నోవేషన్ సెంటర్ కోసం ముందుకు వచ్చింది. అదే సమయంలో రిలయెన్స్ కూడా లక్షన్నర కోట్ల బడ్జెట్ తో విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్, ఏఎం గ్రీన్ సంస్థలు పర్యావరణ అనుకూల ఇంధన రంగం, ఉక్కు తయారీ పరిశ్రమల స్థాపన కోసం వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను ఖరారు చేసుకున్నాయి. అనకాపల్లిలో ఈ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన కూడా పూర్తయింది. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా రక్షించేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం నుండి ఏకంగా రూ. 17,000 కోట్ల భారీ రివైవల్ ప్యాకేజీని సాధించారు. ఉత్తరాంధ్రను గ్లోబల్ ఎకనామిక్ మ్యాప్‌లో నిలబెట్టేందుకు ప్రతిష్టాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్…
చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన 24 నెలల్లోనే భారతదేశానికి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడులలో దాదాపు 26 శాతం వాటాను ఏపీ సాధించింది. గూగుల్, ఐబీఎం, రిలయన్స్, ఆర్సెలార్ మిట్టల్, బ్రూక్‌ఫీల్డ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఆక్సెంచర్, కేప్ జెమిని వంటి గ్లోబల్ దిగ్గజాలు రాష్ట్రానికి రావడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకమే కారణమని చెబుతారు. మరోవైపు ఎపి ప్రభుత్వం తెచ్చిన ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0తో పాటు సరికొత్త ఐటీ, గ్రీన్ ఎనర్జీ విధానాలు. ప్రభుత్వం అవలంభిస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస’ వల్ల కేవలం 14 నుంచి 21 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు లభిస్తుండటంతో పెట్టుబడిదారులు రాష్ట్రంపై దృష్టిని పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మూడు వ్యూహాత్మక ఆర్థిక క్లస్టర్లుగా విభజించి ప్రపంచ పరిశ్రమలను ఆకర్షించింది. రూ.23లక్షల కోట్ల బృహత్తర పెట్టుబడులు ప్రధానంగా ఐదు రంగాలలో కేంద్రీకృతమయ్యాయి. క్లీన్ ఎనర్జీ సస్టైనబిలిటీ రంగం రూ.12 లక్షల కోట్లతో సోలార్ విండ్ హైబ్రిడ్, పంప్డ్ హైడ్రో స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలకు విస్తరించింది. భారీ కోర్ పరిశ్రమలు, ఉత్పాదక రంగం రూ.4 లక్షల కోట్ల కమిట్మెంట్లతో ఉక్కు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీలను కలిగి ఉంది. సముద్ర పోర్టుల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ రంగానికి మరో రూ.4 లక్షల కోట్లు కేటాయించబడగా, డిజిటల్ ఎకానమీ రంగం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా వైజాగ్‌లో గూగుల్ 1 గిగావాట్ డేటా సెంటర్‌ను, రిలయన్స్–బ్రూక్‌ఫీల్డ్ సంయుక్తంగా 1.5 గిగావాట్ గ్రీన్ ఎనర్జీ ఐటీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తుండగా, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ డీప్‌టెక్ స్టార్టప్‌లకు ప్రధాన నోడ్‌గా నిలవనుంది.
భారీ పరిశ్రమల విభాగంలో ఆర్సెలార్ మిట్టల్ రూ.1.25 లక్షల కోట్లతో ఉక్కు కర్మాగారాన్ని స్థాపిస్తుండగా, హిందుజా గ్రూప్ తన ప్లాంట్‌ను మరో 1,600 మెగావాట్ల సామర్థ్యంతో విస్తరిస్తోంది. ఏఎమ్ గ్రీన్ గ్రూప్ రూ.10,000 కోట్లతో సెకండ్ జనరేషన్ ఇథనాల్ బయో రిఫైనరీలు, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాంట్ ద్వారా ‘ఫార్మ్టు ఫ్లైట’ పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తోంది. ఇక ఐటీ రంగంలో కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఆక్సెంచర్, కేప్ జెమిని సంస్థలు ఉమ్మడిగా 45,000 కోడింగ్ ఉద్యోగాలను తెస్తున్నాయి. తద్వారా రాష్ట్రానికి భారీగా పన్ను ఆదాయం రానుంది. కాకినాడ మొదలుకుని నెల్లూరు వరకు విస్తరించి ఉన్న కోస్తా ఆంధ్రా ప్రాంతం కీలక ఇంధన జోన్‌గా, పోర్ట్ ఆధారిత అభివృద్ధికి కేంద్రంగా నిలిచింది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. క్లీన్ ఎనర్జీ పెట్టుబడులలో 78.5 గిగావాట్ల సోలార్, 35 గిగావాట్ల విండ్ ఎనర్జీ సింహభాగం ఈ ప్రాంతానికే దక్కుతుండగా, కాకినాడ సమీపంలోని ఉప్పాడ వద్ద ‘ఏఎమ్ గ్రీన్ గ్రూప’ రూ.44,000 కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద ‘గ్రీన్ అమ్మోనియా’ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. కృష్ణా జిల్లా, మల్లవల్లిలో హిందుజా గ్రూప్ ఎలక్ట్రిక్ బస్సులు, మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్ రక్షణరంగ నౌకల తయారీ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయి.
అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా ఐబీఎం 50 ఎకరాల్లో దేశంలోనే మొదటి కమర్షియల్ 156–క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ హబ్‌ను నిర్మిస్తోంది. దీనికి తోడు నెల్లూరు, తిరుపతి బోర్డర్లో రూ.25,000 కోట్ల పెట్టుబడులతో దేశంలోనే మొదటి ‘ట్విన్ స్పేస్ సిటీ’ల నిర్మాణానికి పునాది పడింది.
పరుగులెడుతున్న జీఎస్డీపీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంస్కరణలను వేగవంతం చేసంది. పారదర్శకమైన బడ్జెట్ కేటాయింపులు, వృథా ఖర్చుల నియంత్రణ, రాబడి మార్గాల అన్వేషణ ద్వారా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటును ఊహించని వేగంతో పరుగులు తీయించింది. బలమైన పారిశ్రామిక నూతన విధానాలతో పన్నుల వసూళ్లను క్రమబద్ధీకరించడమే కాకుండా, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, ప్రత్యేక ప్యాకేజీలను సకాలంలో రాబట్టడం ద్వారా రాష్ట్ర ఆర్థిక రక్షణను దారిలోకి తెచ్చింది. సంపద సృష్టించి సంక్షేమాన్ని అందించాలనే చంద్రబాబు ఆర్థిక బ్లూప్రింట్ ఇక్కడ విజయవంతంగా పనిచేసింది.
యువతకు ఉపాధి.. ఉద్యోగాల జాతర
పరిశ్రమల రాకతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. గతంలో ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన ఐటీ, టెక్నికల్ నిపుణులను తిరిగి ఆకర్షించేలా నూతన ఐటీ పాలసీని తెచ్చారు. ఈ రెండేళ్లలో స్కిల్ సెంటర్లను ఆధునికీకరించి, పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా యువతకు శిక్షణ ఇప్పించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మెగా డీఎస్సీ ప్రకటనతో నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి, ప్రభుత్వ రంగంలోనూ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
అప్రతిహత సంక్షేమం
అభివృద్ధి ఒక కన్ను అయితే, సంక్షేమం మరో కన్నుగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అత్యంత బాధ్యతాయుతంగా అమలు చేస్తూ వస్తోంది. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పెన్షన్లను రూ. 4000 కు పెంచడమే కాకుండా, ఒకటో తేదీనే లబ్ధిదారుల చేతుల్లో పెట్టేలా పటిష్టమైన వ్యవస్థను రూపొందించారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ‘దీపం’ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ద్వారా ప్రతి ఇంటా సంక్షేమ కాంతిని నింపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న కీలక నిర్ణయాల్లో సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు ప్రధానమైనది. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ మొత్తాన్ని రూ.4 వేలుకు పెంచడం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర బలహీన వర్గాలకు పెద్ద ఊరట కల్పించింది. ఇప్పటివరకు రూ.65 వేల కోట్లకు పైగా పెన్షన్ల రూపంలో పంపిణీ చేయడం దేశంలోనే అరుదైన రికార్డుగా నిలిచింది.
ప్రతి నెలా గ్రామ సచివాలయాల సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందించడం ద్వారా లబ్ధిదారులకు ఇబ్బందులు తగ్గాయి. పెన్షన్ రోజును పండుగలా మార్చిన ప్రభుత్వం అనే గుర్తింపు కూడా ఈ కార్యక్రమం ద్వారా వచ్చింది. పేదలు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, వలస కార్మికులు, ఉద్యోగార్థులు వంటి వర్గాలకు అన్న క్యాంటీన్లు గొప్ప వరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 269 క్యాంటీన్ల ద్వారా కోట్లాది భోజనాలు అందించడం జరిగింది. రోజుకు తక్కువ ఖర్చుతో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం లభించడంతో వేలాది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో అన్న క్యాంటీన్లు సామాజిక భద్రతకు కొత్త రూపంగా నిలిచాయి. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయాన్ని కలిపి ఏడాదికి రూ.20 వేల వరకు అందిస్తున్నారు. 46 లక్షల మంది రైతులకు ఇప్పటికే వేల కోట్ల రూపాయలు జమయ్యాయి. దీనికి తోడు డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ యాంత్రీకరణ, విత్తనాలు, ఎరువులపై సబ్సిడీలు, మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ధరల స్థిరీకరణ వంటి చర్యలు రైతులకు భరోసా కల్పిస్తున్నాయి. ధాన్యం కొనుగోలులో 24 గంటల్లో చెల్లింపులు చేయడం కూడా రైతులకు పెద్ద ఉపశమనం ఇచ్చింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పంచాయతీలకు నిధులు నేరుగా విడుదల చేసి, గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఉపాధి హామీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వసతులను కల్పించారు. వేలాది గ్రామ సభలు నిర్వహించి, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులను ఖరారు చేయడం దేశంలోనే ఒక రికార్డుగా నిలిచింది.
కేవలం నగదు పంపిణీతోనే కాకుండా పేదరిక నిర్మూలన లక్ష్యంగా పి4 కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ‘పీ4 అంటే – పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం. జనాభాలోని అత్యంత సంపన్నులైన 10 శాతం మంది.. పేద కుటుంబాల్లో అట్టడుగున ఉన్న 20 శాతం మందికి నేరుగా సాయం చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది. ఉన్నత కుటుంబాలను మార్గదర్శకులుగా నిలబెట్టి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది సంప్రదాయ సంక్షేమానికి భిన్నంగా సామాజిక భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించే కొత్త నమూనాగా నిలిచింది.
కూటమిలో తిరుగులేని సమన్వయం
ఈ రెండేళ్ల విజయవంతమైన పాలనకు ప్రధాన మూలస్తంభం… కూటమి పార్టీల మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయం. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎక్కడా అహంకారానికి పోకుండా, కేవలం రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్నారు. చంద్రబాబు పరిపాలనా దక్షతకు, పవన్ కళ్యాణ్ నిస్వార్థ రాజకీయ విధానం తోడై ప్రభుత్వం ఒక బుల్లెట్ రైలులా దూసుకుపోతోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తూ, రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులను సాధించుకోవడంలో ఈ కూటమి అసాధారణమైన ఐక్యతను ప్రదర్శించింది. స్వార్థ రాజకీయాల కోసం కాకుండా, ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఏర్పడిన ఈ బంధం అత్యంత బలంగా నిలిచింది.
సంక్షేమాన్ని-అభివృద్ధిని సమపాళ్లలో కురిపిస్తూ సాగుతున్న ఈ ప్రయాణం నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చేందుకు బలమైన పునాది వేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయం, కూటమి శ్రేణుల నిరంతర శ్రమతో ఆంధ్రప్రదేశ్ నేడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలిచింది. ఈ ప్రగతి రథం ఇలాగే సాగాలని, నవ్యాంధ్ర కీర్తి కిరీటం విశ్వవ్యాప్తం కావాలని ఆశిద్దాం.








