మండుతున్న ఎండలు..నగరంలో మూతపడుతున్న చలివేంద్రాలు!
Hyderabad: భానుడి భగభగలకు నగరం అల్లాడుతుంటే, బాటసారుల దాహం తీర్చే చలివేంద్రాలు మాత్రం నీరు లేక వెలవెలబోతున్నాయి. నగరంలో ప్రతి ఏటా స్వచ్ఛంద సంస్థలు, స్థానిక నేతలు ఏర్పాటు చేసే చలివేంద్రాల సంఖ్య ఈసారి గణనీయంగా తగ్గిపోయింది. గతంలో వేల సంఖ్యలో ఉన్న ఈ కేంద్రాలు, ప్రస్తుతం కేవలం వందలకే పరిమితమవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
నీటి సరఫరా లేక ఇబ్బందులు..
జలమండలి , జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా నీటి సరఫరా అందడం లేదని నిర్వహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రి వంటి రద్దీ ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు కేవలం ఒక పూటకే పరిమితమై మూతపడుతున్నాయి. గడిచిన కాలంలో ‘వాటర్ ఏటీఎం’ల పేరుతో హడావుడి చేసిన అధికారులు, ఇప్పుడు కనీసం ఉన్న చలివేంద్రాలకు నీటిని అందించడంలో విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
కూలింగ్ క్యాన్లను కొనలేక..
వాటర్ ఫిల్టర్ కేంద్రాల నుండి క్యాన్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి చలివేంద్రాలను నడపడం స్వచ్ఛంద సంస్థలకు ఆర్థికంగా భారంగా మారింది. రోజుకు 10 నుండి 20 కూలింగ్ క్యాన్ల నీటిని కొనలేక చాలా చోట్ల కేంద్రాలను అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారు.
నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని..
ప్రతి డివిజన్లో కనీసం ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి, అక్కడ బాటసారులకు ఓఆర్ఎస్ ద్రవణం, ప్రాథమిక వైద్య చికిత్స అందేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉచిత నీటి పంపిణీ కేంద్రాలకు నిరంతర నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.








