పేదలకు అందని ఎన్టీఆర్ బేబీ కిట్లు.. పంపిణీలో నిలిచిన పురోగతి!
Paderu: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచడంతో పాటు, పుట్టిన బిడ్డల ఆరోగ్య రక్షణ కోసం ప్రవేశపెట్టిన ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’ పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పాడేరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం కిట్ల పంపిణీ నిలిచిపోవడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఒక తువ్వాలు కూడా కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న నిరుపేదలు, కిట్ల కోసం ఎదురుచూసి చివరకు గత్యంతరం లేక బయట మార్కెట్లో రూ. 1500 నుండి రూ. 1800 వరకు వెచ్చించి అరకొర సామగ్రితో కూడిన కిట్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది.
ఇవి కూడా చదవండి
పంపిణీ పూర్తిగా నిలిపివేత..
పాడేరు జిల్లా ఆసుపత్రిలో నెలకు సుమారు 200 వరకు ప్రసవాలు జరుగుతుండగా, అందులో 90 శాతం మంది గిరిజనులే ఉంటున్నారు. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించగా, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పేరు మార్చి కొన్ని నెలలు పంపిణీ చేసి 2021 నుండి పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలుకు మాత్రం నోచుకోలేదు. కిట్లు అందకపోవడంతో ఆర్థిక స్తోమత లేని వారు పాత చీరలు, దుస్తులను శిశువులకు వాడుతున్నారు, దీనివల్ల పసిబిడ్డలకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కిట్ల పంపిణీ చేపట్టాలని ..
ప్రభుత్వం అందించే బేబీ కిట్లో గతంలో 9 వస్తువులు ఉండగా, ఈసారి వాటిని 11 రకాలకు పెంచుతామని కూటమి ప్రభుత్వం పేర్కొంది. ఇందులో సబ్బు, నాప్కిన్, పౌడర్, తువ్వాళ్లు, బొమ్మ వంటి ముఖ్యమైన వస్తువులు ఉంటాయి. అయితే, ఈ కిట్లు ఇప్పటికీ వైద్యశాలలకు చేరలేదు. ప్రసవాల వివరాలను అధికారులకు నివేదించామని, ప్రభుత్వం నుండి కిట్లు వచ్చిన వెంటనే బాలింతలకు అందజేస్తామని పాడేరు జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఎర్రయ్య తెలిపారు. పేద గిరిజనుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెంటనే కిట్ల పంపిణీ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.








