సీఎం చంద్రబాబు మార్క్ గవర్నెన్స్..!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) అధ్యక్షతన ఈ నెల 7, 8 తేదీల్లో సచివాలయంలో కీలకమైన ‘కలెక్టర్ల కాన్ఫరెన్స్’ జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల వారీగా పాలన తీరుతెన్నులు, ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం నిర్వహిస్తున్న అత్యంత ముఖ్యమైన భేటీ ఇది. రెండు రోజుల పాటు సాగే ఈ సమావేశంలో ప్రజల నుండి అందిన అర్జీల పరిష్కారంపై బాబు కఠినంగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలైన పీజీఆర్ఎస్, ఏపీ సేవ, మీసేవ(Mee Seva) మరియు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిన పెండింగ్ అర్జీలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. సాంకేతికతను వాడుకుని సామాన్యుడి సమస్యను ఎంత వేగంగా పరిష్కరిస్తున్నారనే అంశంపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. టీడీపీ(TDP) కేంద్ర కార్యాలయం మంగళగిరిలో మరియు ముఖ్యమంత్రి నివాసం వద్ద నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’లో అందిన వేలాది వినతుల స్థితిగతులపై చంద్రబాబు అధికారులను వివరాలు అడగనున్నారు.
ఈ వినతులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఏ మేరకు పరిష్కారమయ్యాయో అధికారులు సీఎంకు నివేదించాల్సి ఉంటుంది. ఈ కాన్ఫరెన్స్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. అధికారులు చెబుతున్న వివరాలు వాస్తవమా కాదా అని తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి సమక్షంలోనే అధికారులు లైవ్లో అర్జీదారులకు ఫోన్ చేయనున్నారు.
సమస్య పరిష్కారమైందని అధికారులు చెబుతున్న అర్జీదారులతో నేరుగా మాట్లాడి, సమస్య తీరిందా లేదా అని అడిగి తెలుసుకోనున్నారు. దీనివల్ల అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ప్రజల వద్దకే వెళ్లాలని, ఎక్కడా ఫైళ్లు పెండింగ్లో ఉండకూడదని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా రాబోయే రోజుల్లో ఏపీ పాలనలో పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








