వైసీపీపై విరుచుకుపడ్డ సీఎం చంద్రబాబు..!
కృష్ణా జిల్లా పామర్రు(Pamarru) నియోజకవర్గం పమిడిముక్కలలో పర్యటించిన సీఎం చంద్రబాబు(Chandrababu) వైసీపీపై నిప్పులు చెరిగారు. పేదల సేవలో, మే డే(May Day) వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వ నేర ప్రవృత్తిని, రాష్ట్రాన్ని వారు నాశనం చేసిన తీరును ఎండగట్టారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై(YS Jagan) సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “విపక్షంలో ఉన్నది వైసీపీ కాదు, అది ఒక గొడ్డలి పార్టీ. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు రాజకీయాలకు ఏమాత్రం పనికిరారు. గతంలో ఒకసారి అవకాశమిస్తే అందరినీ మోసం చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు” అని మండిపడ్డారు.
వైసీపీ(YCP) అధినేతకు మానసిక సమస్య ఉందని, తాము రెండేళ్లు కష్టపడి నిర్మించిన ప్రజావేదికను అధికారంలోకి వచ్చిన రెండు గంటల్లోనే కూల్చివేసి తన వినాశకర బుద్ధిని చాటుకున్నారని గుర్తుచేశారు. రాజధాని అమరావతిని, జీవనాడి పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిన అటువంటి పార్టీకి మద్దతిచ్చే వారు ఒకసారి ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, దానివల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రూ. 1,000 కోట్లతో మళ్లీ డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నామని తెలిపారు. “2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం. గోదావరి జలాలను కృష్ణా నదికి అనుసంధానించి రాష్ట్రానికి నీటి కష్టాలు తీరుస్తాం” అని స్పష్టం చేశారు. అలాగే, డిసెంబర్ నాటికి మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ‘మే డే’ను పురస్కరించుకుని పమిడిముక్కలలో కార్మికులకు మరియు పరిశ్రమల యాజమాన్యాలకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పురస్కారాలను అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులకు ‘శ్రమ శక్తి’ పురస్కారాలను అందించి వారిని ఘనంగా సత్కరించారు. రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎం పునరుద్ఘాటించారు.
ఇవి కూడా చదవండి








