అమరావతి కేంద్రంగా మరో కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని(Amaravati) పూర్తి స్థాయి పరిపాలన కేంద్రంగా బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న కీలక ప్రభుత్వ విభాగాలన్నింటినీ అమరావతికి తరలించే ప్రక్రియలో భాగంగా.. ‘ఏపీ మెరైన్ బోర్డ్’ (AP Marine Board) ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి మారుస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అమరావతి నుంచే ఏపీ మెరైన్ బోర్డ్ తన పూర్తి స్థాయి అధికారిక కార్యకలాపాలను నిర్వహించనుంది.
ఈ బదిలీ ప్రక్రియకు సంబంధించి బోర్డు పరిధిలోని సిబ్బంది, రికార్డులు, అలాగే ఆస్తుల తరలింపునకు ఏపీ ప్రభుత్వం పూర్తి అనుమతులు మంజూరు చేసింది. గత ప్రభుత్వ హయాంలో పరిపాలన వికేంద్రీకరణ పేరుతో వివిధ ప్రాంతాలకు తరలిపోయిన కీలక కార్యాలయాలను మళ్లీ రాజధాని ప్రాంతానికి తీసుకువచ్చి, పరిపాలనను ఒకే కేంద్రం నుంచి సులభతరం చేయడమే లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం ఈ అడుగులు వేస్తోంది.
రాష్ట్రంలో సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నందున పోర్టుల నూతనీకరణ, మౌలిక వసతుల కల్పన, మెరైన్ రంగానికి సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఇకపై అమరావతి కేంద్రంగానే పర్యవేక్షించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయంతో రాజధాని అమరావతి పరిధిలో మరింత అడ్మినిస్ట్రేటివ్ హడావుడి పెరగడమే కాకుండా, పారిశ్రామిక, రవాణా రంగాల అనుమతుల ప్రక్రియ వేగవంతం కానుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణంలో ఉన్న మూడు ప్రధాన ఓడరేవులు.. రామాయపట్నం, మచిలీపట్నం, మరియు మూలపేట పోర్టుల పనులను 2026 చివరి నాటికి పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటికి సంబంధించిన పనుల పర్యవేక్షణ, సచివాలయంతో సమన్వయం అమరావతి నుంచే మరింత సులభతరం కానుంది.








