ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగుస్తున్న ఉచ్చు..!
సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ(YSRCP) ఎమ్మెల్సీ అనంతబాబు(Ananth babu) చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఈ కేసులో సాక్షులను బెదిరించారన్న అభియోగాలపై అనంతబాబును ఒకరోజు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కాకినాడలోని మొబైల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న అనంతబాబును పోలీసులు బుధవారం ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. భారీ భద్రత నడుమ ఆయనను రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు తరలించారు. ఈ రోజు మొత్తం పోలీసుల విచారణ కొనసాగనుంది.
ఇవి కూడా చదవండి
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక సాక్షులను ప్రలోభపెట్టడం, వారిని బెదిరించడం ద్వారా కేసును పక్కదారి పట్టించేందుకు అనంతబాబు ప్రయత్నించారనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులు ఆయనను విచారించనున్నారు. సాక్షులను ఎవరెవరి ద్వారా బెదిరించారు? దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ప్రశ్నించనున్నారు. గతంలో విచారణ సమయంలో అనంతబాబు సహకరించలేదనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ ఒకరోజు కస్టడీని పోలీసులు అత్యంత కీలకంగా భావిస్తున్నారు.
విచారణ అనంతరం ఆయనను తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఎమ్మెల్సీ కస్టడీ వార్తతో కాకినాడలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసు విచారణ నెమ్మదిగా సాగిందన్న విమర్శలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలన్న పట్టుదలతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అనంతబాబు జైలులో ఉంటూనే తన అనుచరుల ద్వారా సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఈ కస్టడీని కోరారు. సాక్షులు మాట మార్చకుండా ఉండేందుకు ఈ విచారణ అత్యంత కీలకం కానుంది. జైలు నుంచి లేదా బయట ఉన్న వ్యక్తులతో అనంతబాబు ఎవరితో మాట్లాడారు..? సాక్షులకు వెళ్లిన బెదిరింపు కాల్స్‌కు, అనంతబాబు అనుచరులకు ఉన్న సంబంధంపై పోలీసులు టెక్నికల్ ఆధారాలను సేకరించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి








