ఎంజీఆర్, ఎన్టీఆర్.. ఇప్పుడు విజయ్
తమిళ నాడులో నటుడు విజయ్ దూసుకొచ్చారు. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. దీంతో భారత్ లో ఇద్దరు ప్రసిద్ధ నటులుగా వుంటూ రాజకీయ నాయకులుగా మారిన ఎం.జి. రామచంద్రన్, ఎన్టీ రామారావుతో పోల్చడం అనివార్యమైంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒకప్పుడు భారతీయ చిత్రపరిశ్రమలో దిగ్గజ నటులు. వీరిద్దరూ తమ తమ రాజకీయ పార్టీలను స్థాపించారు. దీంతో జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయ వేదికను తీసుకొచ్చారు. ప్రాంతీయ పార్టీలు రాజకీయ స్వరూపాన్ని ఎలా మార్చేస్తాయో చూపించారు. దీంతో జాతీయ పార్టీలకు కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.
డీఎంకే నుంచి చీలిపోయి, 1972 లో ఎంజీఆర్ అన్నాడీఎంకేని స్థాపించారు. ఆయనకు వుండే ఇమేజీ, క్షేత్ర స్థాయి ఆదరణ కారణంగా 1977 లో అసెంబ్లీ ఎన్నికల గోదాలోకి దిగారు. దీంతో 130 సీట్లతో స్పష్టమైన మెజారిటీని సాధించారు.ఎంజీఆర్ తన మొట్ట మొదటి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. దీని ద్వారా సినీ తారలు రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మార్గం సుగుమం చేశారు.
ఇవి కూడా చదవండి
తర్వాత ఎన్టీఆర్ కూడా ఇదే పంథాను అనుసరించారు. 1982 లో తెలుగు ఆత్మ గౌరవం పేరుతో తెలుగు దేశం పార్టీని స్థాపించారు. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే1983 లో ఎన్నికల గోదాలోకి దిగి, 201 స్థానాలను కైవసం చేసుకున్నారు. దీని ద్వారా కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టారు. భారత రాజకీయ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రాజకీయ ఆరోహణలలో ఒకటిగా ఆయన ఎదుగుదల నేటికీ నిలిచి ఉంది.
ఇప్పుడు నాలుగు దశాబ్దాలకు పైగా గడచిన తర్వాత.. విజయ్ (దళపతి) ప్రస్థానం కూడా ఇదే తీరుగా కనిపిస్తోందని పలువురు అంటున్నారు. 2024లో టీవీకే పార్టీని ప్రారంభించి, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయ వేదికగా తీర్చిదిద్దారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ లాగా కాకుండా, విజయ్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయ క్షేత్రం లోకి అడుగుపెట్టారు. అయినా విజయం సాధించారు. ప్రభుత్వం స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఎంజీఆర్, ఎన్టీఆర్ మాదిరిగానే విజయ్ కూడా ఓటర్ల మనస్సులను గెలుచుకోవడానికి తన అభిమాన గణాన్ని తయారు చేసుకున్నారు. ప్రజా ప్రతిష్ఠ, మార్పు అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ ముగ్గురు కూడా తాము రాజకీయనాయకులం కాదని, ప్రజల నాయకులమని చెప్పుకొచ్చారు.
ఎంజీఆర్, ఎన్టీఆర్ తమ ఎన్నికలను ప్రారంభించినప్పటి నుంచే తమ సినీ ఆకర్షణను రాజకీయ శక్తిగా మార్చుకున్నారు. విజయ్ కూడా వారి సరసన చేరడానికి సిద్ధంగా వున్నాడు. తద్వారా భారత దేశ రాజకీయ యవనికపై కాల్పనికతకు, రియాలిటీకి మధ్య తేడా వుందని చూపించారు.
అయితే టీవీకే మ్యాజిక్ ఫిగర్ కి అవసరమైన 118 సీట్లను సాధించలేదు. కానీ 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దుత తప్పనిసరి. అయితే.. ఎవరు మద్దతిస్తారన్నది మాత్రం తేలలేదు.
ఇవి కూడా చదవండి








