సీన్ రివర్స్.. తృణమూల్ ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తోందని బీజేపీ ఫిర్యాదు
ఎన్నికలు, ఫలితాలు వచ్చాయంటే ఈవీఎం ట్యాంపరింగ్ విషయం తెరపైకి వస్తుంది. సహజంగా ప్రతిపక్షాలన్నీ బీజేపీపైనే ఈ అభాండాలు మోపుతుంటాయి. కానీ.. బెంగాల్ ఎన్నికల సందర్భంగా ఓ విచిత్రం జరిగింది. అధికార తృణమూల్ పై కేంద్రంలో వున్న బీజేపీ ఈ ఆరోపణ చేస్తోంది. రెండో దశ పోలింగ్ సందర్భంగా తమకు పట్టున్న ప్రాంతాలలో తృణమూల్ ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తోందని బీజేపీ ఆరోపించింది.
ఫల్తా అనే నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పేరు కనిపించకుండా, కమలం గుర్తు కనిపించకుండా ఈవీఎంలపై టేపు అంటించి వుంచిన ఫోటో వైరల్ అవుతోంది. దీనిపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య స్పందించారు. ఈ ఘటన బూత్ నెంబర్ 144 లో జరిగిందని, అలాగే 170,189 బూత్ లలోనూ ఇదే విధంగా జరిగిందని ఆరోపించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా చేయడానికి టీఎంసీ స్థానిక అధికారుల సాయంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ ఘటనలు జరిగిన అన్ని బూత్ లలో తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. గతంలో డైమండ్ హార్బర్ స్థానం నుంచి అభిషేక్ బెనర్జీ గెలవడానికి కూడా ఇలాగే చేశారని బీజేపీ గుర్తు చేసింది.
ఇది కాస్త దుమారం రేగడంతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఈవీఎంపై బీజేపీ అభ్యర్థి పేరు కనిపించకుండా చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో ఈసీ విచారణకు ఆదేశించింది. పోలింగ్ బూత్ లో బటన్ల ట్యాంపరింగ్ పై వచ్చిన నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఈసీ తెలిపింది. అవి నిజమని తేలితే.. ప్రభావిత బూత్ లలో తిరిగి పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది.
ఇవి కూడా చదవండి








