కరోనా విపత్తు వేళ… తెలుగు రాష్ట్రాలకు 20 లక్షలు ఇచ్చిన ‘నాటా’
అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోని కమ్యూనిటికీ ఎల్లవేళలా సహాయం అందించే ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాటా) కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు తనవంతుగా ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.20 లక్షలు అందించింది. తెలంగాణ రాష్ట్రానికి రూ.10 లక్షలు, ఏపీకి రూ.10 లక్షలు ఆర్ధిక సాయం చేసింది నాటా అధ్యక్షుడు రాఘవరెడ్డి గోసల, కార్యదర్శి రామిరెడ్డి, ట్రెజరర్ నారాయణ రెడ్డి తదితరులు ఈ ఆర్థిక సహాయాన్ని రాష్ట్రానికి పంపించారు. తెలుగు రాష్ట్రాలు ఏ ఇబ్బందుల్లో ఉన్నా తాము సాయం చేయడానికి ముందుంటామని ‘నాటా’ మీడియా కో ఆర్డినేటర్ డి.వి. కోటి రెడ్డి చెప్పారు. తెలంగాణలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావును కలిసి నాటా ప్రతినిధులు 10 లక్షల రూపాయలను ఆన్లైన్ ద్వారా పంపించిన పత్రాలను అందజేశారు. ఐఎంఎ వైస్ ప్రెసిడెంట్, నాటా ఓవర్సీస్ కో ఆర్డినేటర్ డా. ద్వారకనాథ్‌రెడ్డి, తెలంగాణ నాటా కో ఆర్డినేటర్ రమాదేవి ఈ పత్రాలను మంత్రికి అందజేస్తూ, నాటా తెలుగు కమ్యూనిటికీ చేస్తున్న సేవలను తెలియజేశారు.













