అమెరికా చేరుకున్న భారత ఔషధాలు
కొవిడ్ బాధితులకు చికిత్సనందించేందుకుగానను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విన్నపం మేరకు భారత్ పంపించిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధాలు అమెరికాకు అందాయి. నెవార్క్ విమానాశ్రయానికి శనివారం అవి చేరుకున్నట్లు అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధు తెలిపారు. కొవిడ్ రోగుల చికిత్స కోసం అమెరికా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై ఆధారపడుతోంది. తమకు 35.82 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను ఎగుమతి చేయాలని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఔషధాన్ని తయారుచేసుకునేందుకు అవసరమైన సమ్మేళనాన్ని కూడా 9 మెట్రిక్ టన్నుల మేర పంపించాలని కోరారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకుగాను భారత్ ఆదిలోనే లాక్డౌన్ విధించడాన్ని ప్రఖ్యాత భారతీయ అమెరికన్ వైద్య నిపుణులు రాజీవ్ వెంకయ్య ప్రశంసించారు.













