ఘనంగా బాటా-సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు

బే ఏరియా తెలుగు సంఘం (బాటా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు మిల్‌పిటాస్‌లోని ఐసీసీ మిల్‌పిటాస్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. ‘పాఠశాల’ కార్యక్రమంలో తెలుగు నేర్చుకుంటున్న పిల్లలు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారని సమాచారం. అలాగే ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ కె. శ్రీకర్ రెడ్డి వస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలు కూడా నిర్వహించనున్నారు. అలాగే లిటిల్ చెఫ్, బిగ్ చెఫ్, గేమ్ షోస్, ప్రముఖ సింగర్స్ గీతాలాపనతోపాటుగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా నిర్వహిస్తారు. సంక్రాంతి శోభ కార్యక్రమం అందర్నీ అలరిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. బాటా వారి ఆటా పాటా, ఫుట్ ట్యాపింగ్ డ్యాన్స్, ఆనంద భైరవి క్లాసికల్ డ్యాన్స్ కార్యక్రమాలు కూడా ఈ వేడుకల్లో జరుగుతాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలనుకునే వారు 5 డాలర్లు చెల్లించి టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే 12 సంవత్సరాలలోపు వయసున్న చిన్నారులకు మాత్రం ప్రవేశం ఉచితమని బే ఏరియా తెలుగు సంఘం ప్రకటించింది.