ATA: డిసెంబర్ 12 నుంచి 27 వరకు ఆటా సేవ కార్యక్రమాలు
- అట్టహాసంగా సేవ, సాంస్కృతిక, విద్యా కార్యక్రమాల నిర్వహణ
- ప్రకటించిన ఆటా బృందం
హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో డిసెంబర్ 12 నుంచి 27 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆటా సేవా కార్యక్రమాలు తెలుగు సంస్కృతి, విద్య, సేవా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభంకానున్నాయని ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమ పోస్టర్ విడుదల చేసి, ఆటా బృందం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన సంస్కృతి పట్ల ప్రేమ, మన ప్రజలపై ఆప్యాయత అనే భావంతో ప్రతి సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈసారి మరింత విస్తృతంగా పర్యటిస్తున్నామన్నారు. తెలంగాణలో హైదరాబాద్ సహా రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, సిద్ధిపేట, సిరిసిల్ల తదితర జిల్లాల్లో ఆటా బృందం పలు రంగాల్లో సేవా కార్యక్రమాలను చేపడుతోందన్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో విద్యా స్కాలర్షిప్లు, సేవా కార్యక్రమాలు, సాయంత్రం సాంస్కృతిక వేడుకలు, డిసెంబర్ 13న సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలోని ఐఐటీ కాలేజీలో సెమినార్, స్టార్టప్ పిచ్ పోటీలు, 14న SPR యూనివర్సిటీలో సాహిత్య సదస్సు, 15న యాదగిరి గుట్ల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అనంతరం 16, 17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖల్లో బిజినెస్ సెమినార్లు జరుగుతాయన్నారు.
డిసెంబర్ 19, 20 తేదీల్లో యువజన కార్యక్రమాలు, స్పోర్ట్స్ ఈవెంట్లు, రంగారెడ్డి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్, 21న మహబూబాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, 22న మహబూబ్‌నగర్ జిల్లాలో పిల్లల కోసం విద్య,ఆధ్యాత్మిక,వైద్య సెమినార్ కార్యక్రమాలు, 23న నాగర్‌కర్నూల్ మెడిపూర్ గ్రామంలో మహిళల ఆరోగ్యంపై సెమినార్, హెల్త్ క్యాంపు, 24న సూర్యాపేట జిల్లా అనంతారం గ్రామంలో ఆరోగ్య శిబిరం, ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుందని, డిసెంబర్ 25న సిద్ధిపేటలో నిషాంత్ బాలసదన్ చారిటీ కార్యక్రమం, తరువాత సిరిసిల్ల జిల్లా గంభీరరావుపేటలో పాఠశాల అభివృద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 27న హైదరాబాద్ రవీంద్రభారతిలో ATA గ్రాండ్ ఫినాలేతో వేడుకలు ముగుస్తాయని. అవార్డుల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయని ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి రామసహాయం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీలు, కో చైర్ నరసింహ ద్యాసాని, సాయి సూదిని, ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బాణాల, బోర్డు ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త, మాజీ అధ్యక్షులు పరమేష్ భీమ్ రెడ్డి, బిజినెస్ చైర్ హరీష్ బత్తిని, నర్సి రెడ్డి, తిరుమల్ రెడ్డి, రాజ్ కక్కర్ల తదితరులు పాల్గొన్నారు.













