Yami Gautam: వర్కింగ్ అవర్స్ పై యామీ గౌతమ్
బాలీవుడ్లో నటీమణుల పని గంటలపై మరోసారి చర్చ మొదలైంది. ఇటీవల నటి యామీ గౌతమ్(Yami gautam) చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మళ్లీ హాట్ టాపిక్‌గా మార్చాయి. సినిమా షూటింగ్లలో పని వేళల గురించి మహిళా నటులు మాట్లాడితే అది ఎందుకు వివాదంగా మారుతుందో తనకు అర్థం కావడం లేదని ఆమె అన్నారు. సినిమా ఒక టీమ్ వర్క్ అని, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు కలిసి పరస్పర అవగాహనతోనే పని సమయాలను నిర్ణయించుకుంటారని ఆమె పేర్కొన్నారు. ఒక నటి తన ఆరోగ్యం, వ్యక్తిగత సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాలు చెప్పడం సహజమేనని యామీ అభిప్రాయపడ్డారు.
ఇటీవల కాలంలో యామీ గౌతమ్ విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరుచుకుంటున్నారు. ఇదిలా ఉండగా, బాలీవుడ్లో పని గంటల వ్యవహారం గత కొంతకాలంగా పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా దీపికా పదుకొణె(Deepika Padukone) షూటింగ్లలో లిమిటెడ్ వర్క్ అవర్స్ పై స్పష్టమైన నిబంధనలు ఉండాలని చెప్పిన తర్వాత ఈ విషయం పెద్ద చర్చనీయాంశమైంది. కొన్ని ప్రాజెక్ట్‌లను కూడా ఈ కారణంగా దీపికా వదులుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
సాధారణంగా సినిమా షూటింగ్‌లు చాలా సార్లు 12 నుంచి 16 గంటల వరకు సాగుతాయని తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పని గంటలపై స్పష్టత కోరడం తప్పేమీ కాదని సినీ వర్గాల్లో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన యామీ గౌతమ్, ప్రతి సినిమా పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయని, అందరి అంగీకారంతోనే పని సమయాలు నిర్ణయించబడతాయని చెప్పారు. ముఖ్యంగా మహిళా నటులు తమ అవసరాలు చెప్పినప్పుడు దాన్ని పెద్ద సమస్యగా చూపించడం సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు. ఆరోగ్యం, కుటుంబం, వ్యక్తిగత జీవితానికి కూడా సమాన ప్రాధాన్యం ఉండాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.








