శ్రీముఖి ఇకనైనా నటిగా బిజీ అవుతుందా?
నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) సినిమాలో ప్రధానంగా సమంత(Samantha) నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నప్పటికీ, ఆమెతో పాటు కనిపించిన కొందరు మహిళా పాత్రలు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సమంత స్నేహితురాలి పాత్రలో మంజూష ముక్కవిల్లి(Manjusha Mukkavilli), తోడికోడలి పాత్రలో శ్రీముఖి(Sree Mukhi) తమ నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. బుల్లితెరపై యాంకర్‌గా ఎనర్జిటిక్ ఇమేజ్ను సంపాదించుకున్న శ్రీముఖి, ఈ సినిమాలో మాత్రం పూర్తిగా భిన్నమైన కోణాన్ని చూపించింది. గ్లామర్ లేదా హడావుడి కాకుండా కుటుంబ నేపథ్యంలో సాగే పాత్రలో ఆమె కనిపించిన తీరు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది.
డైరెక్టర్ నందిని రెడ్డి(Nandini Reddy) శ్రీముఖి పాత్రను మామూలు సపోర్టింగ్ రోల్ లాగా కాకుండా కథలో సహజంగా మిళితమయ్యేలా తీర్చిదిద్దారు. చిన్నపాటి అసూయ, అమాయకత్వం, కుటుంబ బంధాల మధ్య ఉండే ఎమోషన్స్ ను ఆమె పాత్ర ద్వారా చూపించిన విధానం మహిళా ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తోంది. ముఖ్యంగా సమంతతో కలిసి వచ్చే కొన్ని సీన్స్ లో ఇద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ సినిమాకు అదనపు బలంగా మారింది. గతంలో సినిమాల్లో కనిపించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కని శ్రీముఖికి ఈ సినిమాలోని పాత్ర నటిగా మరో కోణాన్ని పరిచయం చేసినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సినిమా ఒక్కసారిగా శ్రీముఖి కెరీర్‌ను మార్చేస్తుందని చెప్పలేకపోయినా, ఫ్యూచర్ లో బలమైన క్యారెక్టర్ రోల్స్‌కు ఆమెను పరిశీలించేలా చేసే అవకాశముంది. ప్రస్తుతం టాలీవుడ్లో మధ్యతరహా, కుటుంబ నేపథ్య మహిళా పాత్రలకు సరైన నటీమణుల కొరత కనిపిస్తున్న సమయంలో శ్రీముఖి వంటి ఆర్టిస్టులకు మంచి అవకాశాలు రావచ్చని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక బాక్సాఫీస్ పరంగా కూడా మా ఇంటి బంగారం ఆశాజనక ఆరంభాన్ని నమోదు చేయగా, సినిమాకు వస్తున్న రెస్పాన్స్ లో మహిళా పాత్రల ప్రాధాన్యం ప్రత్యేకంగా చర్చకు రావడం విశేషంగా మారింది.








