సాయి పల్లవి మొదటి అడుగే తడబడిందిగా
బాలీవుడ్‌లోకి ఎంట్రీ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే సాయి పల్లవి(Sai Pallavi), చివరికి ఆమిర్ ఖాన్(Aamir Khan) నిర్మించిన ఏక్ దిన్(EK Din) సినిమాతో హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో ఆఫర్లను తిరస్కరించిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడం ఆసక్తి రేపింది. ఈ రొమాంటిక్ డ్రామాలో ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్(Junaid khan) హీరోగా నటించగా, సాయి పల్లవి హీరోయిన్గా కనిపించారు. మే డే సందర్భంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, మొదటి రోజే ఆశ్చర్యకరంగా నిరాశాజనక కలెక్షన్లను నమోదు చేయడం ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురి చేసింది.
ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ముంబైలో నిర్వహించిన ప్రీమియర్ షోలో ఆమిర్ ఖాన్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా సినిమాకు హైప్ తెచ్చింది. నార్త్ లో ఈ సినిమాకు భారీగా ప్రమోషన్స్ నిర్వహించినప్పటికీ, థియేటర్లలో ఆ ఆసక్తి కనిపించలేదు. హాలిడే, పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడం వంటి అనుకూల పరిస్థితులు ఉన్నా, ఓపెనింగ్స్ మాత్రం బలహీనంగా ఉండటం గమనార్హం.
ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు ప్రతికూల స్పందననే లభిస్తోంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడం, ఎమోషన్స్ ప్రభావం సరిగా పడకపోవడం వంటి విమర్శలు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి యాక్టింగ్ పై ప్రశంసలు ఉన్నప్పటికీ, ఆమె శ్రమ వృథా అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డైరెక్టర్ సునీల్ పాండే(Suneel Pandey) తెరకెక్కించిన ఈ సినిమా, 2016లో విడుదలైన థాయ్ మూవీ వన్ డే(One day)కి రీమేక్‌గా రూపొందింది. మొత్తంగా, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి అడుగులోనే తడబడింది.








