హ్యూమన్ టాలెంట్‌కే ఆస్కార్.. AIకి డోర్ క్లోజ్ చేసిన అకాడమీ!
సినీ ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ప్రముఖ సంస్థ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులకు అర్హత పొందే సినిమాల్లో నటన, రచన పూర్తిగా మనుషుల చేతనే జరగాలని స్పష్టం చేసింది. ఇటీవల రిలీజ్ చేసిన కొత్త రూల్స్ ప్రకారం, AI సహకారంతో రూపొందించిన కంటెంట్‌ను అవార్డుల పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొంది. AI టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, మనుషులు స్పష్టంగా ప్రదర్శించిన నటన మరియు మనుషుల చేత రచించబడిన కథా రచన మాత్రమే ఆస్కార్ అవార్డులకు అర్హత సంపాదిస్తాయి. AI ఆధారంగా సృష్టించిన లేదా మార్పులు చేసిన కంటెంట్‌ను గౌరవించబోమని అకాడమీ తెలిపింది. అయితే పూర్తిగా AI వినియోగాన్ని నిషేధించలేమని కూడా స్పష్టం చేసింది. సాంకేతిక పరిణామాలను అంగీకరించినప్పటికీ, అసలు సృజనాత్మకత మనుషులదే కావాలని అకాడమీ అభిప్రాయపడుతోంది.
ఇటీవల హాలీవుడ్లో పలువురు నటులు, రచయితలు AI కంపెనీలపై కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలతో కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అకాడమీ తీసుకున్న తాజా నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఫ్యూచర్ లో సినిమాల నిర్మాణ విధానంపై ఈ మార్గదర్శకాలు ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, టెక్నాలజీ వేగంగా మారుతున్నప్పటికీ, మనుషుల సృజనాత్మకతకే ప్రాధాన్యం ఇవ్వాలని అకాడమీ మరోసారి స్పష్టం చేసింది.








