తెలుగు దర్శకుడికి అరుదైన పురస్కారం
ప్రముఖ దర్శకుడు టీఎల్ వీ ప్రసాద్‌కు మహారాష్ట్రకు చెందిన దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్-2018 అవార్డు లభించింది. ఈ నెల 20న ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. టీఎల్వీ ప్రసాద్ ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాష్ రావు కుమారుడు. కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో 1952లో ఆయన జన్మించారు. దాదాపు 85 సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో 25, హిందీలో 40, బెంగాలీలో 4, మరాఠీలో 1 చిత్రానికి దర్శకత్వం వహించారు. కేవలం మిథున్ చక్రవర్తితో 8 ఏళ్ల వ్యవధిలో 35 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం హిందీలో జై శ్రీకృష్ణ, జైజైజై భజరంగభళీ వంటి మెగా సీరియల్స్‌కు ఈయనే దర్శకత్వం వహించడం గమనార్హం. తెలుగులో 1980లో కుడి ఎడమైతే చిత్రంతో ప్రారంభమై ఎన్టీఆర్‌తో ఛాలెంజ్ రాముడు, అక్కినేని నాగేశ్వరావు, చిరంజీవి, బాలకృష్ణ వంటి ప్రముఖ నటుల చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు వాడు అయిన ప్రసాద్‌కు హిందీలో చిత్రాలను నిర్మించినందుకు దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు-2018 రావడం పట్ల పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.













