మోడీ పర్యటనతో బీజేపీలో జోష్ వస్తుందా?
ప్రధాని నరేంద్ర మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన రాష్ట్రానికి వస్తుండడం ఇదే తొలిసారి కావడంతో, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం, బీజేపీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. అయితే, ప్రధాని రాకతో రాష్ట్ర బీజేపీలో కొత్త ఉత్సాహం వస్తుందా? లేక పార్టీని వేధిస్తున్న అంతర్గత విభేదాలు మళ్ళీ మొదటికే వస్తాయా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం భారీ వ్యూహరచన చేస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించడంతో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. “బెంగాల్ తరహాలోనే తెలంగాణలో కూడా మేము అధికారంలోకి రావడం ఖాయం” అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ సభ ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లి, రాష్ట్ర రాజకీయాల్లో తామే ప్రత్యామ్నాయం అని చాటిచెప్పాలని పార్టీ భావిస్తోంది.
బయటకు బలంగా కనిపిస్తున్నా, తెలంగాణ బీజేపీని అంతర్గత విభేదాల వైరస్ తీవ్రంగా వేధిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు పార్టీకి తీరని నష్టం చేకూర్చాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అప్పట్లో దూకుడుగా ఉన్న బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి, కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం పార్టీలో చీలికలకు దారితీసింది. బండి సంజయ్ మాస్ ఫాలోయింగ్‌కు, కిషన్ రెడ్డి సౌమ్యమైన వ్యూహాలకు పొంతన కుదరకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చతికిలపడింది.
నేటికీ పార్టీలో పరిస్థితులు ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదు. సీనియర్లకు, కొత్తగా వచ్చిన నేతలకు మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన కీలక నేతలు బీజేపీలో ఇమడలేక, బయటకు వెళ్లలేక సతమతమవుతున్నారు. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, గ్రూపు రాజకీయాలు రాజ్యమేలుతుండడంతో క్షేత్రస్థాయిలో కేడర్ అయోమయంలో ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీకి అందరినీ కలుపుకుపోయే ఒక ధీటైన నాయకుడు అవసరం. రామచంద్రరావు లాంటి సాఫ్ట్ లీడర్ ఇందుకు తగడనే భావన చాలా మందిలో ఉంది. కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా, విపక్షాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ, సొంత పార్టీలోని విభేదాలను రూపుమాపే నాయకత్వం కోసం కేడర్ ఎదురుచూస్తోంది. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను ఆకర్షించాలన్నా, పార్టీని అధికార తీరాలకు చేర్చాలన్నా వ్యవస్థాగత మార్పులు అనివార్యం.
ప్రధాని మోడీ పర్యటన అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూనే, పార్టీ శ్రేణుల్లో ఐక్యతను పెంచే ప్రయత్నం చేయనుంది. అయితే, కేవలం ప్రధాని రాకతోనో, అమిత్ షా వ్యూహరచనతోనో పరిస్థితులు మారిపోవని రాజకీయ నిపుణులు అంటున్నారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు సద్దుమణగనంత వరకు, నేతల మధ్య సయోధ్య కుదరనంత వరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా బీజేపీ పరిస్థితి మారుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్న మాట వాస్తవమే అయినా, ఆ ఆదరణను ఓట్ల రూపంలో మార్చుకోవడంలో బీజేపీ విఫలమవుతోంది. మరి రేపటి మోడీ సభ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో, పార్టీలోని అసంతృప్త నేతల మనసు మారుస్తుందో లేదో వేచి చూడాలి.








