ఆ పార్టీలు ఎన్నికల సంఘంపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నాయి? : కిషన్ రెడ్డి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అంటే మజ్లిస్ (Majlis), కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు భయపడుతున్నాయి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు. ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఆ పార్టీలు ఎన్నికల సంఘంపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నాయి? అని ప్రశ్నించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని, బయట రాష్ట్రాల ఉద్యోగులను తీసుకురాలేదని, అయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) ఎన్నికల సంఘంపై విమర్శలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. పాతబస్తీలో అనేక దొంగ ఓట్లు ఉన్నాయని, బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి వచ్చిన అక్రమ వలసదారులు, రోహింగ్యాలు హైదరాబాద్లోని కొన్ని బస్తీల్లో నివసిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని ఓటును హైదరాబాద్కు మార్చుకుంటే రేషన్ కార్డు ( ration card), పెన్షన్ పోతాయని కాంగ్రెస్ (Congress) తప్పుడు ప్రచారం చేస్తోందని, ఓటు హక్కుకు సంక్షేమ పథకాలతో సంబంధం లేదని చెప్పారు. ఈ దేశ పౌరుడు కాని ఏ వ్యక్తీ ఓటర్ల జాబితాలో ఉండకూడదన్నారు. దేశం కోసం, హైదరాబాద్ రక్షణ కోసం సర్లో పాల్గొనాలని, బీజేపీ కార్యకర్తలు ఒక్క ఇల్లు కూడా వదలకుండా తిరగాలని సూచించారు.








