‘టీఆర్ఎస్’ రిటర్న్స్..? కవిత గేమ్ స్టార్ట్..!
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కీలక మలుపు చోటుచేసుకుంది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె తన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (టీఆర్ఎస్ )గా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాని అభ్యంతరాలు ఇతర విషయాలను పరిశీలించిన తరువాత ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పచ్చజెండా ఊపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 29ఎ కింద పార్టీ నమోదు కోసం దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించిన ఈసీ.. నిబంధనల ప్రకారం పత్రికల్లో పబ్లిక్ నోటీసు జారీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 28న కవితకు ఈసీ అధికారిక లేఖ పంపింది. బంజారాహిల్స్ చిరునామాతో ఉన్న ‘తెలంగాణ ప్రజా జాగృతి’ని రాజకీయ పార్టీగా మార్చేందుకు ఏప్రిల్ 23న కవిత ఈసీకి దరఖాస్తు చేశారు. దీన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం.. దరఖాస్తులో ప్రతిపాదించిన ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుపై బహిరంగ ప్రకటన ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఒకప్పుడు గులాబీ జెండా నీడన ఎదిగిన కవిత, ఇప్పుడు అదే పాత పేరును గుర్తుకు తెచ్చేలా వ్యూహాత్మకంగా ఈ పేరును ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన పాత ‘టీఆరఎస’ సెంటిమెంటును తిరిగి తట్టిలేపడమే లక్ష్యంగా ఆమె ఈ అడుగు వేసినట్లు స్పష్టమవుతోంది.
పాంచజన్యంతో ప్రజల్లోకి..!
పార్టీ ప్రకటన వేదికపై కవిత చేసిన ప్రసంగం అత్యంత ఆవేశపూరితంగా, భావోద్వేగంతో సాగింది. తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావిస్తూనే, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల గొంతుకగా నిలుస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇన్నాళ్లూ అక్కగా ఆశీర్వదించారని, ఇకపై అమ్మగా ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా తన తండ్రి కేసీఆర్ పైన కూడా కవిత విమర్శలు గుప్పించారు. ‘కేసీఆర్ ఇప్పుడు మారిన మనిషి అని.. మర మనిషి’ అని విమర్శించారు. ముఖ్యంగా ‘పాంచజన్యం’ పేరుతో ఆమె ప్రకటించిన ఐదు ప్రధాన హామీలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. విద్య విషయంలో ఆమె అత్యంత కీలకమైన వాగ్దానం చేశారు. పిల్లలు ఎంతవరకు చదువుకున్నా తల్లిదండ్రులపై ఒక్క రూపాయి భారం పడనివ్వనని, అమ్మలా వారిని చదివించే బాధ్యత నాది అని ప్రకటించారు. వైద్యం విషయంలోనూ ప్రజాకర్షక హామీ ఇచ్చారు. ఎటువంటి రోగమైనా, ఏ దవాఖానాలోనైనా సరే ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని, రైతన్నను రాజుగా చేయడమే తన లక్ష్యమని కవిత వెల్లడించారు. ఇక యువతను ఆకర్షించేలా ఉపాధి విషయంలో భారీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 4 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. వీటన్నింటికీ తోడు సామాజిక న్యాయం తన పార్టీ మూలస్తంభమని కవిత పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ బంగారు తెలంగాణను సాధించి తీరుతామని ప్రతినబూనారు. గతంలో బీఆరఎస్ హయాంలో మిగిలిపోయిన పనులను, అసంపూర్తిగా ఉన్న హామీలను నెరవేర్చే బాధ్యత తన పార్టీ తీసుకుంటుందని ఆమె ప్రకటించారు.
లిక్కర్ స్కామ్ నీడ- జైలు జీవితం ప్రభావం
ఢిల్లీ లిక్కర్ స్కాం ఉదంతం కవిత రాజకీయ జీవితంలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఈ కుంభకోణంలో ఆమెపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలు, అనంతరం జరిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ విచారణలు ఆమె ప్రతిష్టను దెబ్బతీశాయి. నెలల తరబడి జైలు జీవితం గడపడం, బెయిల్ కోసం చేసిన న్యాయపోరాటం ఆమెకు వ్యక్తిగతంగా, రాజకీయంగా పెద్ద పరీక్షగా నిలిచాయి. లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితురాలిగా ముద్ర పడటం వల్ల ప్రజల్లో ఆమె పట్ల ఉన్న విశ్వసనీయతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. బీఆరఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కావడానికి ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం ప్రధాన కారణం. కుటుంబంలో తలెత్తిన విభేదాలు, పార్టీలో మనుగడ కష్టమైన పరిస్థితుల్లో కవిత సొంత పార్టీ వైపు మొగ్గు చూపారు.
2029 ఎన్నికలే లక్ష్యం!
రాబోయే జీహెచఎంసీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని కవిత ప్రకటించడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని తెలుపుతోంది. ముఖ్యంగా 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని, తెలంగాణ గడ్డపై తమ జెండా ఎగురవేస్తామని ఆమె ధీమాగా చెప్పారు. ఒక కొత్త పార్టీకి క్షేత్రస్థాయిలో యంత్రాంగం నిర్మించుకోవడం, బలమైన కేడర్ ను తయారు చేసుకోవడం అంత సులభం కాదు. కానీ, కవితకు ఉన్న పాత నెట్ వర్క్, తెలంగాణ జాగృతి ద్వారా సంపాదించుకున్న గుర్తింపు ఆమెకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ లాంటి నగరంలో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తన సత్తా చాటాలని ఆమె భావిస్తున్నారు. కానీ, ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆరఎస్ వంటి బలమైన శక్తులు ఉన్న నేపథ్యంలో కవిత పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ముళ్లబాటలో ప్రయాణం – సవాళ్లు అనేకం
ప్రస్తుతం కవిత చేస్తున్న ఈ రాజకీయ ప్రయోగం ఒక సాహసమే అని చెప్పాలి. రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ శూన్యత ఏమీ లేదు, బలమైన పోటీదారులున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన తండ్రికి ధీటుగా ఎదగాలనే ఆకాంక్షతో ఆమె వేసిన ఈ అడుగు ముళ్లబాట లాంటిదే. విమర్శలను ఎదుర్కొంటూ, ఆరోపణల నుంచి బయటపడి, ప్రజల మద్దతును కూడగట్టడం ఆమె ముందున్న అతిపెద్ద సవాలు. 2029 లక్ష్యంగా ఆమె ప్రకటించిన యుద్ధం కేవలం మాటలకే పరిమితం అవుతుందా లేక నిజంగానే తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన మలుపు. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావం మాత్రమే కాదు, ఒక కుటుంబ వారసత్వ పోరుకు, రాజకీయ ఉనికి కోసం జరుగుతున్న పోరాటానికి సంకేతం. కవిత తనపై ఉన్న ఆరోపణలను ఎలా తిప్పికొడతారు, తన పార్టీని ఈసీఐలో ఎలా రిజిస్టర్ చేయించుకుంటారు, ప్రజల ముందుకు ఏ ఎజెండాతో వెళ్తారు అనే అంశాలపైనే ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు, ఏదీ అసాధ్యం కాదు. అయితే, పారదర్శకత లేని వ్యూహాలు, గందరగోళానికి గురిచేసే పేర్లు రాజకీయ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేస్తాయి.
కవిత పార్టీ మనుగడ సాధ్యమేనా?
రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే కేవలం సెంటిమెంటు ఉంటే సరిపోదు, బలమైన ఓటు బ్యాంక్ ఉండాలి. కవిత పార్టీకి ప్రస్తుతం ఒక స్పష్టమైన ఐడెంటిటీ కొరవడిందనే వాదన బలంగా ఉంది. బీఆరఎస్ నుంచి విడిపోయిన అసంతృప్త నేతలే ఆమెకు ఆధారం అని కొందరు అంటున్నారు. అయితే, తెలంగాణ సమాజం ప్రస్తుతం కొత్త నాయకత్వం కోసం చూస్తోందా? లేదా పాత బాటిల్ లో కొత్త వైన్ లాంటి కవిత పార్టీని ఆదరిస్తుందా? అనేది చూడాలి. తెలంగాణ సెంటిమెంటును వాడుకోవాలని చూడటం పాత చింతకాయ పచ్చడి వంటి వ్యూహమే అయినా, అది నేటి యువతను ఆకర్షించగలదా అనేది అనుమానమే. పైగా లిక్కర్ స్కామ్ ఆరోపణలు వెంటాడుతున్న తరుణంలో, ప్రజలు ఆమెను ఏ మేరకు విశ్వసిస్తారు అనేది పార్టీ మనుగడను నిర్ణయించే ప్రధానాంశం కానుంది.
పార్టీ పెట్టడానికి కారణాలు!
కవిత కొత్త పార్టీ పెట్టడానికి దారితీసిన పరిస్థితులు కూడా అత్యంత నాటకీయంగా సాగాయి. కొంతకాలంగా బీఆరఎస్ అగ్ర నాయకత్వంతో, ముఖ్యంగా తన సోదరుడు కేటీఆర్ తో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో బీఆరఎస్ అధిష్టానం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తన తండ్రి స్థాపించిన పార్టీ నుంచే బహిష్కరణకు గురికావడం కవితను తీవ్రంగా కలిచివేసింది. ఈ అవమానాన్ని సవాలుగా తీసుకుని, తన ఉనికిని చాటుకోవడానికి, తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి ఆమె ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సస్పెన్షన్ వేటు పడిన అతి తక్కువ కాలంలోనే కొత్త పార్టీని ప్రకటించడం ఆమె రాజకీయ వేగాన్ని సూచిస్తోంది.








