“తండ్రి వేరు.. రాజకీయాలు వేరు”.. కవిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపిన తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రస్థానంపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ఆమె తన తండ్రి కేసీఆర్‌తో ఉన్న వ్యక్తిగత అనుబంధానికి, రాజకీయ సిద్ధాంతాలకు పొంతన లేదని స్పష్టం చేశారు.
మీట్ ది ప్రెస్ లో కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను విమర్శించేది తన తండ్రి కేసీఆర్‌ను కాదని, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను మాత్రమేనని ఆమె కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ లేకపోతే తాను లేనని అంగీకరిస్తూనే, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాలను, అనుసరిస్తున్న విధానాలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సంబంధాలు వేరని, రాజకీయ పోరాటాలు వేరని స్పష్టం చేశారు. తండ్రి చాటు బిడ్డగా కాకుండా ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదిగేందుకే ‘తెలంగాణ రక్షణ సేన’ను స్థాపించినట్లు ప్రకటించారు.
గడిచిన 20 ఏళ్లుగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల కోసం పనిచేస్తున్న ‘తెలంగాణ జాగృతి’ సంస్థ భవిష్యత్తుపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. జాగృతి ఎప్పటికీ స్వచ్ఛంద సంస్థగానే కొనసాగుతుందని, కేవలం రాజకీయ పోరాటాల కోసమే ‘రక్షణ సేన’ పనిచేస్తుందని వివరించారు. రాజకీయాల్లోకి రావడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని వివరించారు. అన్ని అడ్డంకులను దాటుకుని, ప్రజల గొంతుకగా మారడానికే ఈ రాజకీయ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వాల తీరుపై కవిత ఘాటుగా స్పందించారు. పాలనలో అమ్మతనం లోపించిందని, అందుకే సామాన్యుల కష్టాలు పాలకులకు పట్టడం లేదని విమర్శించారు. అమ్మలాగా తాను కూడా పరిణితి చెందాలని భావిస్తున్నానని, ప్రభుత్వాలకు మానవీయ కోణం ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
రైతుల దుస్థితిపై మాట్లాడుతూ కవిత భావోద్వేగానికి గురయ్యారు. జాగృతి జనంబాటలో తాను కలిసిన ఒక రైతు, మరుసటి రోజే పంట కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒక రైతు మరణం కేవలం చిన్న వార్తగా మిగిలిపోవడం విచారకరమని, తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతును నిజమైన రాజుగా మారుస్తామని ప్రతిన పూనారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం, సర్వోదయ తెలంగాణ సాధనే లక్ష్యంగా తమ పార్టీ ‘పాంచజన్యం’ అనే ఐదు అంశాలతో కూడిన ప్రత్యేక కార్యాచరణను ప్రకటించినట్లు కవిత చెప్పారు. సమాజంలోని అసమానతలను తొలగించడం, సమగ్ర అభివృద్ధిని సాధించడం, ప్రజల పక్షాన నిరంతర పోరాటం చేయడం, యుద్ధ ప్రాతిపదికన సమస్యలను పరిషికారించడం, మానవీయ కోణంలో పరిపాలన కొనసాగించడం తెలంగాణ రక్షణ సేన ఉద్దేశమని కవిత చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఈ ఐదు సూత్రాలతో రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా యుద్ధ భేరీ మోగిస్తామని ఆమె హెచ్చరించారు.
భావోద్వేగపూరితమైన ప్రసంగంతో పాటు, పక్కా రాజకీయ వ్యూహంతో కవిత తన భవిష్యత్తు కార్యాచరణను ఆవిష్కరించారు. ఒకవైపు సెంటిమెంట్‌ను పండిస్తూనే, మరోవైపు అభివృద్ధి అజెండాను ప్రజల ముందుంచారు. తండ్రికి ఎదురు నిలిచి రాజకీయ యుద్ధం ప్రకటించిన కవిత అడుగులు తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని ఏ విధంగా మారుస్తాయో వేచి చూడాలి.








