డ్రగ్స్ దందాపై పోలీసుల ‘గురి’.. ఎంతటి వారైనా వదిలేది లేదన్న సీఎం!
Drug Trafficking: హైదరాబాద్ నగరంలోకి గుట్టుచప్పుడు కాకుండా వస్తున్న మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా డార్క్ వెబ్‌ను వేదికగా చేసుకుని, కోడ్ భాషలో డ్రగ్స్ ఆర్డర్ చేస్తున్న ముఠాల లింకులను ఛేదించేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు సన్నద్ధమయ్యారు. కొరియర్ సేవల ద్వారా డ్రగ్స్ నేరుగా వినియోగదారుల ఇంటి గుమ్మంలోకే చేరుతుండటంపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. డ్రగ్స్ వినియోగం వల్ల మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు పెరగడాన్ని పోలీసులు సీరియస్ గా పరిగణిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నిందితుల వేటలో ప్రత్యేక నిఘా..
నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ నేతృత్వంలో డ్రగ్స్ మూలాలను వెతికి పట్టుకునేందుకు ఎస్ హెచ్ ఓలకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. వీకెండ్ పార్టీలు, పబ్ లపై ప్రత్యేక నిఘా పెంచారు. నగరానికి వచ్చే ప్రముఖ డీజేలు, ఈ దందాతో సంబంధం ఉన్న పాత నేరస్తుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరాదారులు పట్టుబడకుండా ఉండేందుకు కొత్త వ్యక్తులను రంగంలోకి దింపుతూ భారీ కమిషన్లు ఆశచూపుతున్నట్లు సమాచారం అందింది. పోలీసులు పట్టుకున్నా డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకుండా స్మగ్లర్లు రూట్లు మారుస్తున్నారు.
విక్రేతలకు కఠిన చర్యలు..
రాష్ట్రానికి చేరుతున్న డ్రగ్స్ ను కట్టడి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పోలీసులను ఆదేశించారు. డ్రగ్స్ లావాదేవీల్లో ఎంతటి వారున్నా అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం పోలీసులు మత్తుకు బానిసైన వారిని గుర్తించి, వారిని శిక్షించే బదులు డీ-అడిక్షన్ (విముక్తి) కేంద్రాలకు తరలిస్తున్నారు. అదే సమయంలో, డ్రగ్స్ మూలాలను కనుగొనే వరకు దర్యాప్తు ఆపవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.








