ఆకాశమే హద్దుగా.. జయంత్, శౌర్యల జెట్ ఫైటర్ డ్రోన్.. త్వరలో ప్రదర్శన!
Hyderabad: దేశ సైనిక అవసరాలను తీర్చేందుకు హైదరాబాద్ బిట్స్ పిలానీకి చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు జయంత్ ఖత్రి, శౌర్య చౌదరి సరికొత్త ‘డ్రోన్ జెట్ ఫైటర్’ను రూపొందించారు. ఈ ప్రోటోటైప్ జెట్ ఫైటర్‌ను ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా పరీక్షించగా, ఇది గంటకు 700-800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని గుర్తించారు. త్వరలోనే దీని పనితీరును సైన్యాధికారులకు ప్రదర్శించనున్నారు.
రూ. 4 కోట్లు పెట్టుబడి..
ఈ ఆవిష్కరణను మరింత అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థలు స్కైరూట్, ధ్రువ స్పేస్ ముందుకొచ్చాయి. జయంత్, శౌర్యలు నిర్వహిస్తున్న ‘అపోలియాన్ డైనమిక్స్’ అనే స్టార్టప్ సంస్థలో రూ. 4 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఈ సంస్థలు అంగీకరించాయి. ఈ మేరకు సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నిధులను జెట్ ఫైటర్ల తయారీ, అభివృద్ధికి వినియోగించనున్నారు.
రాబోయే రోజుల్లో మొబైల్ డ్రోన్ యూనిట్లను..
గత మూడేళ్లుగా డ్రోన్లపై పరిశోధనలు చేస్తున్న జయంత్, శౌర్యలు తక్కువ ఖర్చుతో వీటిని రూపొందించాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం ‘అపోలియాన్ డైనమిక్స్’ను ప్రారంభించారు. గతంలోనూ వీరు భారత సైన్యానికి తక్కువ ధరలో డ్రోన్లను సరఫరా చేశారు. రాబోయే కొద్ది నెలల్లోనే మొబైల్ డ్రోన్ యూనిట్లను కూడా రూపొందించి అందించనున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం వీరి సంస్థలో 15 మంది నిపుణులు పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి








