గూగుల్ రాకతో ఆంధ్రప్రదేశ్ దశమారింది.. గ్లోబల్ టెక్ హబ్‌గా విశాఖ
ఆంధ్రప్రదేశ్ రాజకీయ.. ఆర్థిక దిశను సమూలంగా మార్చివేసే ఒక నవశకానికి విశాఖపట్నం ఇప్పుడు వేదికవుతోంది. గూగుల్ రాక విశాఖకే కాదు ఏపీకి గేమ్ చేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇవాళ మరచిపోలేని రోజుగా చెప్పారు. చరిత్రకు శ్రీకారం చుట్టబోయే రోజుగా వర్ణించారు. కేంద్రప్రభుత్వం-గూగుల్ సంస్థకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఏపీ రాష్ట్ర భవిష్యత్తును మార్చివేయగల ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్‌కు ఏప్రిల్ 28వ తేదీన శంకుస్థాపన జరిగింది. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, ఐటీ మంత్రి లోకేశ్, కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, శ్రీనివాసవర్మ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ పాల్గొన్నారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 1997లో హైటెక్ సిటీతో ప్రారంభించామన్నారు. గూగుల్ ఐఏ డేటా సెంటర్.. ఏపీ టెక్నాలజీతోపాటు దేశానికి గ్రోత్ ఇంజన్‌గా మారుతుందన్నారు. టెక్నాలజీ హబ్‌కు భవిష్యత్తులో తుర్లవాడ పేరు మార్మోగుతోందన్నారు. కొత్త ఆవిష్కరణలకు ఏపీ ఎప్పుడూ స్వాగతం పలుకుతోందన్నారు. దేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్ వేగా నిలుస్తుందన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో భారత్‌కు ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుందని అన్నారు. డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమమే కాదని ఏపీ డిజిటల్ భవిష్యత్తుకు పునాదిగా అభివర్ణించారు. సెర్చ్ ఇంజిన్ గా మొదలైన గూగుల్, భారత్ గ్రోత్ ఇంజిన్ గా మారబోతోందన్నారు. ఓడరేవుల వంటి కీలక రంగాల్లో పని చేస్తున్న అదానీ గ్రూప్, ప్రజలను కమ్యూనికేషన్‌తో అనుసంధానం చేస్తున్న మరో సంస్థ ఎయిర్ టెల్ అని అన్నారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు రావడం శుభపరిణామంగా చెప్పారు. 2028 సెప్టెంబర్ నాటికి గూగుల్ డేటా సెంటర్ పూర్తి కావాలని, ప్రభుత్వ అన్నివిధాలుగా సహకారం అందిస్తుందన్నారు. విశాఖకు గూగుల్ రాక ఉత్తరాంధ్రకే గర్వకారణమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటవుతోందని తెలిపారు. విశాఖను గూగుల్ ఎంపిక చేసుకోవడం ఏపీకి గర్వకారణమని వ్యాఖ్యానించారు. గూగుల్, ఎయిర్టెల్ రెండూ కీలక సంస్థలని వెల్లడించారు. సెప్టెంబర్ 2028 నాటికి గూగుల్ డేటా సెంటర్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. అతి త్వరలో అన్నిరంగాల్లో ఏఐ సేవలు వస్తాయని వివరించారు. 60 రోజుల్లో అనకాపల్లి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు వస్తాయని చెప్పుకొచ్చారు.
అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి
విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ ప్రతిపాదించిన సుమారు రూ. 1.3 లక్షల కోట్ల హైపర్‌స్కేల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా (ఎఫ్.డీఐ) రికార్డు సృష్టించనుంది. 1,000 మెగావాట్ల విద్యుత్ వినియోగంతో నడిచే ఈ భారీ ప్రాజెక్ట్ భారతదేశంలోనే అతిపెద్ద డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా నిలవనుంది. ఇది కేవలం ఒక భవనం కాదు.. కృత్రిమ మేధ (ఏఐ) , క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చే ఒక ఇంజిన్. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడం ద్వారా విశాఖ కేవలం పరిపాలనా నగరం మాత్రమే కాదు.. గ్లోబల్ టెక్నాలజీ రాజధాని అని చాటిచెప్పారు.
గ్లోబల్ ఇన్వెస్టర్లకు స్వర్గధామంగా ఏపీ
కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. ఆర్సెలార్ మిట్టల్, రీన్యూ పవర్ వంటి దిగ్గజాల అడుగుజాడల్లో ఇప్పుడు గూగుల్ రాకతో రాష్ట్రంపై అంతర్జాతీయ పెట్టుబడిదారులకు నమ్మకం రెట్టింపు అయ్యింది. ఈ భారీ పెట్టుబడితో విశాఖ పరిసర ప్రాంతాల్లో మూడు బృహత్తర టెక్నాలజీ క్యాంపస్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇవి ప్రపంచ స్థాయి క్లౌడ్ సర్వీసులు, ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు, డేటా ప్రాసెసింగ్ సదుపాయాలను అందిస్తాయి. దీనివల్ల
స్థానిక స్టార్టప్‌లకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. పరిశోధన మరియు అభివృద్ధి రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుంది. నైపుణ్యం కలిగిన లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.








