Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు సర్జరీ.. కొద్దిరోజుల పాటు విశ్రాంతి!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని(Janasena) పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయనకు తాజాగా శస్త్రచికిత్స జరిగినట్లు జనసేన పార్టీ వర్గాలు ధృవీకరించాయి. శుక్రవారం ఉదయం తన నివాసంలో అధికారులతో కలిసి పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తుండగా పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు ఆయనను ఆసుపత్రికి తరలించారు.
దీనితో నిన్న, నేడు జరగాల్సిన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్‌కు ప్రాథమిక పరీక్షలతో పాటు ఎం.ఆర్.ఐ (MRI) స్కాన్ నిర్వహించారు. నివేదికలను పరిశీలించిన వైద్య బృందం, ఆయనకు తక్షణమే శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించి సర్జరీ పూర్తి చేసినట్లు జనసేన పార్టీ అధికారిక ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఈ వివరాలను వెల్లడించారు. వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని ప్రకటించారు.
అయితే, ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరియు సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ సమయం పడుతుందన్నారు. అప్పటి వరకు ఆయన తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు. ఈ వార్తతో జనసైనికులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పితో బాధ పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైద్యం చేయించుకున్న పవన్.. అధికారిక కార్యక్రమాల్లో బిజీ అయ్యారు.








