ఏపీ గ్యాస్ కష్టాలకు చెక్, విశాఖకు 46 వేల టన్నుల ఎల్పీజీ..!
గత కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న గ్యాస్ కొరత సమస్యకు తెరపడనుంది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయిన గ్యాస్ సరఫరా మళ్ళీ పుంజుకుంది. వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధిని(Strait Of Hormuz) దాటుకుని సుమారు 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ (LPG) ని లోడ్ చేసుకున్న భారీ భారతీయ నౌక విశాఖపట్నం వైపు దూసుకువస్తోంది. ఈ భారీ ఎల్పీజీ నౌక మే 13వ తేదీన విశాఖపట్నం నౌకాశ్రయానికి చేరుకోనుంది.
ఇందులో ఉన్న 46 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ సుమారు 32 లక్షల గృహ సిలిండర్లను నింపడానికి సరిపోతుందని అంచనా. ఈ నౌక రాకతో రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర మరియు కోస్తా జిల్లాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్ల వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. నౌక విశాఖ చేరుకున్న వెంటనే, గ్యాస్‌ను పైప్లైన్ల ద్వారా విశాఖలోని ప్రతిష్టాత్మక ‘భూగర్భ గ్యాస్ నిల్వ కేంద్రానికి’ తరలిస్తారు. సముద్ర మట్టానికి సుమారు 190 మీటర్ల లోతులో ఉన్న ఈ కేంద్రం నుండి గ్యాస్‌ను హిందుస్తాన్ పెట్రోలియం (HPCL), ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOCL) వంటి బాట్లింగ్ ప్లాంట్లకు పంపిస్తారు.
అక్కడ సిలిండర్లలో నింపి వినియోగదారులకు పంపిణీ చేస్తారు. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరగడంతో ఏపీలో కూడా సిలిండర్ల లభ్యత కష్టమైంది. ఇప్పుడు సరఫరా మెరుగుపడటంతో మార్కెట్లో గ్యాస్ కొరత తీరడమే కాకుండా, సాధారణ ప్రజలకు ఊరట లభించనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ పంపిణీ వ్యవస్థను పర్యవేక్షిస్తూ, అక్రమ నిల్వలు ఉండకుండా చర్యలు చేపట్టింది. విశాఖ బాట్లింగ్ ప్లాంట్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 5 జిల్లాలకు మరియు ఇతర ప్రాంతాలకు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తారు. విశాఖపట్నంలో ప్రపంచంలోనే అత్యంత లోతైన మరియు భారతదేశంలోనే మొదటిదైన భూగర్భ ఎల్పీజీ స్టోరేజ్ క్యావెర్న్ ఉన్న సంగతి తెలిసిందే.








