టాప్ ప్లేస్లో బీసీ సంక్షేమ శాఖ.. పవన్ కళ్యాణ్ శాఖకు చివరి స్థానం..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుకు సంబంధించి కీలక ర్యాంకులను ప్రకటించారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) ఆధారంగా ప్రభుత్వం ఈ ర్యాంకులను కేటాయించింది. మొత్తం 100 పాయింట్లకు గానూ 100 పాయింట్లు సాధించి బీసీ సంక్షేమ శాఖ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవగా, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పర్యవేక్షణలోని అటవీ మరియు పర్యావరణ శాఖ కేవలం 67 పాయింట్లతో చిట్టచివరి స్థానానికి పరిమితమైంది.
ప్రభుత్వ శాఖల పనితీరును విశ్లేషించేందుకు ఈసారి ‘ABCD’ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేశారు. ఇందులో మెరుగైన ప్రదర్శన కనబరిచిన శాఖలకు ‘A’ గ్రేడ్ కేటాయించగా, వెనుకబడిన శాఖలకు తక్కువ గ్రేడులు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 శాఖలు 90 శాతానికి పైగా పాయింట్లు సాధించి ఉత్తమ పనితీరు కనబరిచినట్లు నివేదిక వెల్లడించింది. అయితే, పర్యావరణం మరియు అటవీ శాఖ తక్కువ పాయింట్లు సాధించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు సేవలందించడంలో పారదర్శకత, వేగం మరియు జవాబుదారీతనం ప్రాతిపదికగా ఈ గణాంకాలను సిద్ధం చేశారు.
ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడమే లక్ష్యంగా శాఖల వారీగా ఈ సమీక్ష నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. వెనుకబడిన శాఖలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, 90 శాతం కంటే ఎక్కువ ప్రజా సంతృప్తిని సాధించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. గతంలో పంచాయతీ రాజ్ వంటి శాఖల్లో పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేసినప్పటికీ, అటవీ శాఖలో ఆశించిన స్థాయిలో లక్ష్యాలను చేరుకోవడంలో ఆ శాఖ వెనుకబడినట్లు ఈ ర్యాంకులు సూచిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ లోపాలను సరిదిద్ది శాఖను పరుగులు పెట్టించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
ఇవి కూడా చదవండి








