AP Liquor Scam: మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న మద్యం ముడుపుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన మూలాలను తవ్వేకొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా ఈ కేసులో కట్టా ప్రణోయ్ ప్రకాష్ అనే వ్యక్తిని సిట్ అరెస్టు చేయడం ఈ దర్యాప్తులో ఒక కీలక మలుపుగా మారింది.
ప్రణోయ్ ప్రకాష్ ఈ కేసులో కీలక నిందితుడైన టి.ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి ఐఐటీ క్లాస్మేట్. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మద్యం వ్యాపారంలో ఫీల్డ్ మానిటరింగ్ పేరుతో జరిగిన అక్రమాల్లో ఇతను క్రియాశీలక పాత్ర పోషించారు. మొదట హైదరాబాద్‌లోని రాజ్ కెసిరెడ్డి కార్యాలయంలో పనిచేసిన ప్రణోయ్, ఆ తర్వాత విశాఖపట్నంలో ఒక కాల్ సెంటర్‌ను కూడా నిర్వహించారు.
తాడేపల్లి సమీపంలోని ల్యాండ్‌మార్క్ అపార్ట్మెంట్ (ఫ్లాట్ నంబర్ 312) ను మద్యం ముడుపుల కోసం ఒక ప్రత్యేక డెన్ గా వాడుకున్నారు. వివిధ డిస్టిలరీలు, మద్యం సరఫరా చేసే కంపెనీల ప్రతినిధులు నేరుగా ఈ ఫ్లాట్‌కు వచ్చి ముడుపుల సొమ్మును అందజేసేవారు. ఒక్కో విడతలో సుమారు రూ.20 నుంచి 25 లక్షల నగదును అట్టపెట్టెల్లో నింపి ప్రణోయ్ ప్రకాష్‌కు ఇచ్చేవారు. ఈ విధంగా వసూలైన కోట్లాది రూపాయలను ప్రణోయ్ ప్రకాష్ ఎప్పటికప్పుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులకు చేరవేసేవారు. ఈ సొమ్మునే 2024 ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేసినట్లు సిట్ నిర్ధారించింది.
ఇవి కూడా చదవండి
2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన వెంటనే, ఈ ముఠా అప్రమత్తమైంది. సాక్ష్యాలను చెరిపేసే క్రమంలో భాగంగా ప్రణోయ్ ప్రకాష్ దగ్గరున్న ఫోన్లను ధ్వంసం చేసి, అతన్ని హుటాహుటిన దుబాయ్‌కు పంపించేశారు. మద్యం ముడుపుల ద్వారా వచ్చిన నల్లధనాన్ని విదేశాల్లో పెట్టుబడిగా పెట్టేందుకు ప్లాన్ చేశారు. టాంజానియాలో ఇనుప ఖనిజ కర్మాగారం ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి ప్రణోయ్ను జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాలకు పంపారు. గతేడాది జనవరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వయంగా టాంజానియా వెళ్లి, ఈ విషయాలు ఎక్కడా బయటపెట్టవద్దని ప్రణోయ్ను హెచ్చరించినట్లు సిట్ గుర్తించింది.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గతంలోనే ప్రణోయ్పై సిట్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. విమానాశ్రయాల్లో పట్టుబడతాననే భయంతో, అతను ఉత్తరప్రదేశ్ మీదుగా నేపాల్‌కు వెళ్లి, అక్కడి నుండి దుబాయ్ తప్పించుకోవాలని ప్లాన్ చేశాడు. అయితే, భారత్-నేపాల్ సరిహద్దులోని సోనౌలి చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది అతన్ని గుర్తించి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే విజయవాడ నుండి వెళ్లిన ప్రత్యేక బృందం అతన్ని అదుపులోకి తీసుకుంది.
ప్రణోయ్ ప్రకాష్ అరెస్టుతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 17కు చేరింది. ముడుపుల సొమ్ము ఎక్కడికి వెళ్లింది? ఏయే కంపెనీలు ఎంత ఇచ్చాయి? అనే విషయాలపై ప్రణోయ్ ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ మద్యం కుంభకోణంలో ఇంకా ఎన్ని పెద్ద తలకాయలు బయటకొస్తాయో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి

















