సంచలనం కలిగిస్తున్న సిద్ధార్థ లూథ్రా ట్వీట్స్..!!
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన తరపున ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరచిన అనంతరం.. అక్కడ ఆయన్ను హౌస్ కస్టడీకి అనుమతించాలంటూ లూథ్రా వాదించారు. అయితే ఆయన వాదనలను జడ్జి తిరస్కరించారు. అనంతరం హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించారు. ఆ పిటిషన్లు కూడా వాయిదా వేశారు న్యాయమూర్తి. ఇలా చంద్రబాబు కోసం లూథ్రా చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. దీంతో ఆయన అసహనానికి గురవుతున్నట్టు తెలుస్తోంది.
సిద్ధార్థ లూథ్రా ప్రముఖ న్యాయవాది. గంటలలెక్కన ఆయన ఫీజు వసూలు చేస్తుంటారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన ఏపీలోనే మకాం వేశారు. ఆయన్ను బయటకు తీసుకువచ్చేందుకు, ఆయనపై చేసిన ఆరోపణలనుంచి బయట పడేసేందుకు లూథ్రా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు సఫలం కావట్లేదు. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో లూథ్రా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో లూథ్రా ట్విట్టర్ వేదికగా చేస్తున్న ట్వీట్లు సంచలనం కలిగిస్తున్నాయి.
వరుసగా రెండు రోజులు సిద్ధార్థ లూథ్రా ట్వీట్లు చేశారు. గురుగోవింద్ సింగ్.. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు రాసిన జాఫర్ నామా లోని ఓ సూక్తిని బుధవారం ట్వీట్ చేశారు లూథ్రా. “అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపుమేర కనిపించనప్పుడు కత్తి పట్టడమే సరైనది. పోరాటమే శరణ్యం” అని ట్వీట్ చేశారు. దీంతో ఎవరికి తోచిన విధంగా వాళ్లు అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడి అరెస్టును ఉద్దేశించే ఈ ట్వీట్ చేసి ఉంటారని కొందరు భావిస్తున్నారు. చంద్రబాబుకోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఇక కత్తిపట్టడమే శరణ్యమని లూథ్రా సూచించారని భావిస్తున్నారు. లూథ్రా చేతులెత్తేశారని.. కత్తి పట్టాలని సూచించడం దేనికి సూచిక అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
గురువారం లూథ్రా మరో ట్వీట్ చేశారు. “స్వామి వివేకానంద కర్మయోగంలో ఇలా అంటారు.. ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని పట్టించుకోకుండా మనిషి తన విధులను నిర్వర్తించాలి. అలాగే న్యాయం, ధర్మంకోసం నిలబడిన సిక్కు గురు చెప్పిన సూక్తులను అర్థం చేసుకోనివారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.” ఇలా లూథ్రా వరుస ట్వీట్లు చేస్తుండడం ఏపీలో ఆసక్తి రేపుతోంది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్లు చేస్తున్నారో అర్థం కాక ఆరా తీయడం మొదలు పెట్టారు.













