అమెరికా చేతుల్లోనే ‘వార్’ బాల్…ఇరాన్ క్లారిటీ.!
యుద్ధం ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్.. దాన్ని ఆపాల్సింది కూడా ఆ దేశాలే అంటోంది ఇరాన్. తాము యుద్ధం చేయాలని ప్రయత్నించలేదని.. తమపై వచ్చి పడిన యుద్ధాన్ని విపత్కర పరిస్థితుల్లోనే ఎదుర్కొంటున్నామని స్పష్టం చేసిందీ. తాము యుద్ధానికి వ్యతిరేకమే అని.. అయితే అమెరికా కోరుకుంటే మరోసారి యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. యుద్ధం గురించి తమకు చెప్పడం కన్నా .. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై ఒత్తిడి తెవాలని ప్రపంచదేశాలకు ఇరాన్ సూచిస్తోంది.
యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాలని భారత్లో ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహి పేర్కొన్నారు. ప్రస్తుతం యుద్ధం లేని, శాంతి లేని పరిస్థితి నెలకొందన్నారు. అంతర్జాతీయంగా సాధారణ పరిస్థితులు నెలకొనడం అనేది యుద్ధాన్ని ప్రారంభించిన వారి చేతుల్లోనే ఉందన్నారు.
‘‘ఈ యుద్ధాన్ని ఇరాన్ కోరుకోవడం లేదు. ఈ ఘర్షణను నివారించేందుకు అనేక ప్రయత్నాలు చేశాం. వాళ్లు నిరంతరం దాడులు చేయడంతోనే ప్రతిస్పందించాల్సి వచ్చింది. వాళ్లకు ఆ అధికారం ఎవరు ఇచ్చారు? చర్చల్లో పురోగతి సమయంలోనే భీకర దాడులు చేసి సుప్రీం లీడర్ సహా అనేక మంది మరణానికి కారణమయ్యారు. చిన్నారులు సహా సామాన్యులను చంపారు. మొత్తంగా 4వేల మంది ప్రాణాలు కోల్పోగా, మరో 40 వేల మంది ఇరాన్ పౌరులు గాయపడ్డారు. అనేక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి’’ అని పేర్కొన్నారు.
బేషరతుగా లొంగిపోవాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారని, దాన్ని ఎవ్వరూ అంగీకరించరని ఇలాహి స్పష్టం చేశారు. పరిష్కార మార్గాలపై తమను ప్రశ్నించడానికి బదులు ఈ ఘర్షణలను ప్రారంభించిన వాళ్లకే యుద్ధాన్ని ఆపాలని సూచించాలన్నారు. దాడుల వల్ల ప్రతిఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే వారి ఉద్దేశమన్నారు. కానీ అది ఎప్పటికీ నెరవేరబోదన్నారు.








