జూన్ 19, 20 తేదీల్లో అమెరికాలో అంబరాన్నంటేలా ‘మాటా’ రెండో మహాసభలు
MATA: అమెరికాలోని తెలుగు వారందరినీ ఒకే తాటిపైకి తెస్తూ ‘మన అమెరికా తెలుగు సంఘం’ (MATA) తన ప్రతిష్టాత్మకమైన రెండో మహాసభలను (MATA 2nd Convention ’26) నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. జూన్ 19, 20 తేదీలలో పెన్సిల్వేనియాలోని ఓక్స్‌లో గల గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
భద్రాచల శ్రీ సీతారామ కళ్యాణ వేడుకలు..
“ఏ డివైన్ జర్నీ అక్రాస్ అమెరికా” పేరుతో మే 30 నుండి అమెరికాలోని ప్రధాన నగరాలైన టంపా, శాన్ ఆంటోనియో, డల్లాస్, అట్లాంటాలలో భద్రాచల శ్రీ సీతారామ కళ్యాణ వేడుకలు జరగనున్నాయి. ఈ ఆధ్యాత్మిక యాత్ర ముగింపుగా జూన్ 20న కన్వెన్షన్ వేదికపై భద్రాచలం నుండి వచ్చే అర్చకుల సమక్షంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించనున్నారు.

సంగీత విభావరి..
వినోద రంగంలో భాగంగా జూన్ 19న ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల లైవ్ కాన్సర్ట్, జూన్ 20న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) మెగా మ్యూజికల్ కన్సర్ట్ జరగనున్నాయి. వీరితో పాటు సుమ కనకాల, ఐశ్వర్య రాజేష్, నిఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి టాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకల్లో మెరవనున్నారు.
యూత్ ఫోరమ్..
యువత కోసం ప్రత్యేకంగా ‘యూత్ ఫోరమ్’ ఏర్పాటు చేసి, సినీ తారలతో ముఖాముఖి, వివిధ పోటీలు నిర్వహించనున్నారు. కృత్రిమ మేధపై అవగాహన కల్పించేందుకు ‘ఫ్యూచరిస్టిక్ AI హ్యాకథాన్’, విద్యార్థుల కోసం ‘AI పవర్డ్ లెర్నింగ్’ సెషన్లు నిర్వహించనున్నారు.
క్రీడా పోటీలు..
మహాసభల నేపథ్యంలో మే, జూన్ మాసాల్లో వివిధ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. వాలీబాల్ (నోవి, MI), పికిల్‌బాల్ (డౌనింగ్‌టౌన్, PA), క్రికెట్ (డెలావేర్), మహిళల త్రోబాల్, చెస్ టోర్నమెంట్లు ఏర్పాటు చేశారు.
ఆరోగ్యం & న్యాయం..
ఎడిసన్‌లో ప్రతి నెలా ఉచిత హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులు, ప్రవాసుల కోసం ప్రతి నెలా ఆఖరి శనివారం జూమ్ వేదికగా ఉచిత ‘న్యాయ సదస్సులు’ నిర్వహిస్తున్నారు.
వ్యాపార, సావనీర్ అవకాశాలు..
వ్యాపారవేత్తల కోసం వెండర్ బూత్‌లు, సావనీర్లో ప్రకటనల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్, జ్యువెలరీ, ఇతర సేవల కోసం ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
శ్రీనివాస్ గనగోని, రమణ కిరణ్ దుడ్డగి, శ్రీధర్ గూడల, ఇతర కమిటీ సభ్యుల నేతృత్వంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు వారందరూ ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
మరిన్ని వివరాలకు..
వెబ్సైట్: www.mata-us.org
హెల్ప్ లైన్: +1 888-7MATAUS, +1 (888) 762-8287








